26-08-2025 12:35:51 AM
దశల వారీగా ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి చర్యలు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ టౌన్, ఆగస్టు 25 (విజయ క్రాంతి)ః పేదవారికి అధునాతన వైద్య సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో నల్గొండ జిల్లాలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నట్లు రాష్ర్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సుమారు కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్ యూనిట్ ను పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించగా, రాష్ర్ట మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా లాప్రోస్కోపిక్ యూనిట్ ప్రారంభించడం సంతోషమని అన్నారు. నల్గొండ జిల్లాలో పేద ప్రజలకు మంచి వైద్యం అందించేందుకు గతం నుంచి తాను కృషి చేస్తున్నానని మంత్రి తెలిపారు. ఏడాదిలోపే ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించామని, రూ.40 కోట్లతో నర్సింగ్ కళాశాలను సైతం కట్టిస్తున్నామని, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని అంచలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అత్యాధునిక, ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగిన లాప్రోస్కోపిక్ యూనిట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్యాస్ ఎంట్రాలజిస్టు డాక్టర్ జీవీ రావు , ప్రముఖ సామాజిక కార్యకర్త, చారిటీ నిర్వాహకులు ఎస్పీ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, డీఎంహెఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెఎస్ మాతృనాయక్, నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు హఫీజ్ ఖాన్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాధాకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.