25-08-2025 07:27:45 PM
వనపర్తి,(విజయక్రాంతి): పీర్లగుట్ట వద్ద రూ. 1.25 కోట్ల యం.పి. లాడ్ నిధులతో నిర్మిస్తున్న కళాశాల బాలికల వసతి గృహ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ వనపర్తి పట్టణంలోని పీర్లగుట్ట వద్ద నూతనంగా నిర్మిస్తున్న కళాశాల బాలికల వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ యం.పి లాడ్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న వసతి గృహ నిర్మాణం నవంబర్ చివరి వారం వరకు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేవని అందువల్ల త్వరగా పనులు పూర్తి చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. గ్రౌండ్ ఫ్లోర్ మరియు మొదటి అంతస్తు వరకు ప్రస్తుతం మంజూరు పొందిన ఈ వసతి గృహానికి భవిష్యత్తులో మరో అంతస్తు నిర్మించే విధంగా చూస్తామని తెలిపారు.
మొత్తం 8 విశాలమైన గదులతో పాటు రెండు పక్కల మరుగుదొడ్లు నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో కలిపి 120 మంది విద్యార్థులు వసతి ఉండే విధంగా నిర్మాణం చేస్తున్నారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఈ.డి ఎస్సీ కార్పొరేషన్ మల్లికార్జున్, పంచాయతీరాజ్ డి.ఈ శ్రీనివాసులు, ఆర్.ఐ. మధు, మహిళా వసతి గృహ ప్రిన్సిపాల్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.