calender_icon.png 25 August, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకాలంలో రైతులకు యూరియా అందించాలి

25-08-2025 09:52:05 PM

సిపిఎం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా

సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి

నకిరేకల్,(విజయక్రాంతి): సకాలంలో రైతులకు యూరియా అందించి పంట పొలాలను ఆదుకోవాలని సిపిఎం  జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం నకిరేకల్, కట్టంగూరు కేతపల్లి  మండల కేంద్రంలో  మండల వ్యవసాయ  కార్యాలయం ముందు సిపిఎం మండల కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ ధర్నాలో తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సరిపడా యూరియా అందించడంలో వివక్ష చూపిస్తుందని అన్నారు. నాట్లు వేసి  నెలరోజులు గడుస్తున్న యూరియా దొరకక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

యూరియా కొరకు రైతులు రోజు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని, అరకోరగా వచ్చే యూరియా కొరకు రోజంతా లైన్లో నిలబడి ఒకటి, రెండు బస్తాలు దొరకడమే గగనం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు, సొసైటీల ద్వారా వచ్చిన యూరియాను అధికార పార్టీ నాయకులు, సొసైటీ డైరెక్టర్లు కాజేస్తున్నారని సామాన్య రైతులకు  కష్టతరంగా మారిందని విమర్శించారు. యూరియా బ్లాక్ మార్కెట్ దందా నడుస్తుందని ఫర్టిలైజర్ షాపులలో ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తూ, పైగా ఇతర పురుగు మందులు కూడా కొనుగోలు చేయాలని నిబంధనలు పెట్టి రైతులను దోచుకుంటున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రానికి కావాల్సినంత యూరియా అందించడంలో బిజెపి ప్రభుత్వం, బిజెపి యెతారా ప్రభుత్వాల రాష్ట్రాల పైన వివక్ష చూపిస్తుందని, కేంద్రం నుంచి కావాల్సినంత యూరియా రాబట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి అన్నారు. ఖరీఫ్ కు ముందు ప్రభుత్వం,అధికారులు కావలసినంత యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారని, ఇప్పుడు ఆ స్టాక్ అంతాఏమైపోయినట్లుని వారు ప్రశ్నించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వ్యవసాయ అధికారులకు అందజేశారు.