calender_icon.png 8 September, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ పట్టుకుంటే.. ఈగల్ టీం, హైడ్రా టీం ఏం చేస్తుంది..?

08-09-2025 03:59:27 PM

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించినందుకు సీఎం రేవంత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా.. కాంగ్రెస్ సన్నాసులకు ఆఖరికి కాళేశ్వరమే దిక్కయిందన్నారు. మల్లన్నసాగర్ దగ్గర శంకుస్థాపన చేస్తే ఇవి కాళేశ్వరం నీళ్ళే కదా అని, రైతులు ఎక్కడ గల్లా పట్టి నిలదీస్తారో అని, గండిపేట దగ్గర సీఎం రేవంత్ డ్రామా చేస్తున్నారని అన్నారురూ. 1,110 కోట్లతో అయిపోయే ప్రాజెక్టు వ్యయం సుమారు ఏడు రెట్లు పెంచి రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు.. ఎందుకోసం? ఎవరికోసం? అని మండిపడ్డారు. కొండపోచమ్మ సాగర్ కాదని మల్లన్నసాగర్ నుండి ప్రాజెక్టును మొదలుపెడుతున్నారు.. కొండపోచమ్మ సాగర్ నుండైతే గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకోవచ్చని.. సుంకిశాల రీటైనింగ్ వాల్ కూలిపోతే ఆ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోలేదని.. మళ్ళీ అదే సంస్థకు రూ. 7,400 కోట్ల ప్రాజెక్ట్ అప్పచెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదే కంపెనీని ఇంతకుముందు రేవంత్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని అన్నాడు.. ఇప్పుడు వాళ్లే బెస్ట్ ఇండియా కంపెనీ ఎలా అయ్యారో చెప్పాలన్నారు.

 కొండపోచమ్మసాగర్ నుండి హైదరాబాద్‌కు గోదావరి జలాలు తెచ్చే రూ. 1,100 కోట్ల ప్రాజెక్ట్ వ్యయం రూ. 7,400 కోట్లకు ఎవరి లాభం కోసం పెరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. జీహెచ్ఏంసీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ వాటర్ స్కీం రద్దు చేస్తుందని అన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ తాము 50 కిలోమీటర్ల రింగ్ మెయిన్ నిర్మాణం చేశామని.. రాబోయేది మన కేసీఆర్ ప్రభుత్వమే.. మిగతా రింగ్ మెయిన్ కూడా తామే పూర్తి చేస్తామని అన్నారు. ఈ రింగ్ మెయిన్ ద్వారా గోదావరి, కృష్ణా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తానికి మరో 500 ఏళ్ళైనా నీళ్ల కరువు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం మొత్తం 24 గంటలు నల్లా నీళ్లు ఇచ్చేటట్లు వాగ్దానం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు వచ్చి నెలల తరబడి కార్మికుడిలా పని చేసి రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు.. 21 నెలల నుండి ఆ డ్రగ్స్ కంపెనీపై ఏం చర్యలు తీసుకోలేదంటే, రేవంత్ రెడ్డికి ఏమైన ముడుపులు అందాయా..? అని విమర్శించారు. రేవంత్ రెడ్డి, హోంమంత్రి శాఖ, ఈగల్ టీం, హైడ్రా టీం ఏం చేస్తుంది..? మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ కంపెనీపై రైడ్స్ చేస్తుంటే.. తెలంగాణ పోలీసులు కేసీఆర్ పాటలు పెట్టిన డీజే బాక్సులు తీసుకుపోవడంలో, రీట్వీట్ కొట్టిన వారిపై కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారని కేటీఆర్ అన్నారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మేము పాల్గొనడం లేదు 

రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారని.. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్నారని అన్నారు. 20 రోజుల కిందట తాము హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని.. అందుకే 70 లక్షల రైతన్నల తరుపున మేము ఎన్నికలు బహిష్కరించామని పేర్కొన్నారు. తాము ఎన్డీఏ సబార్డినేట్ కాదని.. ఇండియా సబార్డినేట్ కాదని.. మేము తెలంగాణ ప్రజల సబార్డినేట్ అని తెలిపారు. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను తెలియజేయడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటూ.. రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో తాము పాల్గొనడం లేదని కేటీఆర్ వెల్లడించారు.

ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ మీద కేటీఆర్ స్పందన..

కవితపై మా పార్టీ మాట్లాడి చర్యలు తీసుకుందని.. చర్యలు తీసుకున్నాక తాను మాట్లాడడానికి ఏమీ లేదని కేటీఆర్ పేర్కొన్నారు.