calender_icon.png 22 November, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యుల నిర్లక్ష్యంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి

09-02-2025 11:34:54 PM

తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని “యంజాల్ ఆస్పత్రి”లో ఘటన

కుటుంబ సభ్యులతో పాటు ఆందోళనకు దిగిన కార్మిక సంఘాలు

ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉండే భవన నిర్మాణ రంగ కార్మికుడు సత్యం గౌడ్ శనివారం ఉదయం గ్యాస్ట్రిక్ సమస్యతో దాగన్నూగడలోని యంజాల్ ఆసుపత్రిలో చేరాడు. కాగా ఆదివారం ఉదయం సత్యం ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ విషయాన్ని కుంటుంబ సభ్యులకు చెప్పడంతో ఆసుపత్రిలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సత్యంగౌడ మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, యంజాల్ ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీరికి తోడుగా సీపీఐ జిల్లా నాయకులు యాదయ్య, సీపీఎం తుర్కయంజాల్ కార్యదర్శి కిషన్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.శివకుమార్ తో పాటు పలువురు నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. మృతిడి కుటంబానికి రూ.50లక్షల పరిహారం అందజేసి, వారి కుంటుంబాన్ని ఆదుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.