calender_icon.png 5 October, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన దుర్గమ్మ సాక్షిగా దోపిడీ..!

05-10-2025 05:55:19 PM

ఏడుపాయల్లో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న గుత్తేదారులు 

మహిళలతో దురుసుగా ప్రవర్తిస్తున్న గుత్తేదారు

ఈవోకు ఫిర్యాదు చేసిన సంబంధికులు

పాపన్నపేట (విజయక్రాంతి): వెల్మకన్నెకు చెందిన రాజేందర్ గ్రామస్తులతో కలిసి వనదుర్గమ్మకు ఒడి బియ్యం సమర్పించారు. ఒడి బియ్యం పోసేందుకు కావలసిన ఆలయ రసీదును రూ.50 చెల్లించి తీసుకున్నాడు. అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించినా అనంతరం అక్కడే ఉన్న గుత్తేదారు నాగ్సన్పల్లికి చెందిన జీవన్ రెడ్డి సదరు మహిలను ఓడి బియ్యం కట్నం అడగగా ఆమె రూ.50 తీసి ఇచ్చింది. అవి సరిపోవు రూ.100 చెల్లించాల్సిందేనని ఆమెతో దురుసుగా ప్రవర్తించాడని సదరు గ్రామస్తులు ఈవోకు ఫిర్యాదు చేశారు.

కష్టాలు తీర్చితే నిలువు దోపిడీ ఇస్తామని తమ ఇష్ట దైవమైన వనదుర్గామాతకు భక్తులు మొక్కుకుంటారు. ఆ శ్రమ మీకేం అవసరం లేదు.. క్షేత్రానికి వస్తే మిమ్మల్ని మేమే దోచుకుంటామని ప్రతిన పూనుతున్నారు వ్యాపారులు, గుత్తేదారులు. అమ్మవారికి సమర్పించే మొక్కులకు సంబంధించి ఆలయం ఇచ్చే రసీదు తీసుకున్నా.. గుత్తేదారులు వారి చేతికి కొంత సొమ్ము ముట్ట చెప్పాలని భక్తులను డిమాండ్ చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా వారితో సైతం దురుసుగా ప్రవర్తించి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏడుపాయలకు రావాలంటేనే దోపిడీకి గురవుతామేమోనని భయాందోళనకు గురవుతున్నారు. ఏడుపాయల వనదుర్గా మాత పుణ్యక్షేత్రంలో భక్తుల దోపిడీ యదేచ్ఛగా సాగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని భక్తులు ఆరోపిస్తున్నారు. 

భక్తుడే సర్వస్వం..

దేవుడు ఉన్నది భక్తుడి కోసమే. భక్తుడు సైతం దేవస్థానానికి వచ్చేది దేవుడి కోసమే. భక్తుడికి, దేవుడికి మధ్య అనుసంధాన్ని పెంచేలా సౌకర్యాలు కల్పించాల్సిన దేవస్థానం అందుకు విరుద్ధంగా ఆదాయమే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. ఈ తతంగం అంతా ఆలయ అధికారులకు తెలిసే జరుగుతున్నా పట్టించుకోవడంలేదని భక్తులు మండిపడుతున్నారు. వారికి అందాల్సిన ముడుపులు అందడంతోనే నోరు మెదపడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. 

ప్రతి వస్తువుపై అ'ధనం'

భక్తుడు క్షేత్రంలోకి ప్రవేశించిన వెంటనే దోపిడీ ప్రారంభమవుతుంది. ఓడి బియ్యం తో మొదలు పెడితే చిన్న నీళ్ల సీసా వరకు భక్తులు దోపిడీకి గురవుతున్నారు. ఆలయం చెంతన ఉన్న దుకాణాల్లో ప్రతి వస్తువుపై అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో వస్తువుపై రూ.10 నుంచి రూ.20 వసూలు చేస్తూ భక్తులను దోపిడీ చేస్తున్నారు. ఒడి బియ్యం నిర్వాహకులు మహిళా భక్తురాలితో దురుసుగా ప్రవర్తించి నగదు డిమాండ్ చేసిన విషయమై ఆలయ ఈవో చంద్రశేఖర్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.