01-07-2025 02:07:17 AM
నిర్మల్ జూన్ 30 (విజయ క్రాంతి): నిర్మ ల్ ప్రెస్‌క్లబ్ సామాజిక అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని, సమాచార వ్యవస్థ ద్వారా ప్రజలు, పాలకులు, అధికారుల మధ్య అనుసంధానం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల సూచించారు. నిర్మల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు నేపథ్యంలో సోమవారం కొత్త కమిటీ సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలెక్టర్, ఎస్పీలను కలిశారు. వారితో పాటు ఏఎస్పీలు రాజేష్ మీనా, ఉపేంద్రరెడ్డిలను శాలువాలతో సత్కరించి, నూతన కమిటీని పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడు తూ సమాజంలో పాత్రికేయుల బాధ్యత ఉన్నతమైందని తెలిపారు. ప్రస్తుతం సామాజిక రుగ్మతలుగా మారిన మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు పాత్రికేయులు సహకరించాలని కోరారు. సీజనల్ వ్యాధులపైనా అవగాహన కల్పించాలని సూచించారు. నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా పౌరసంబంధాల అధికారి విష్ణును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.