calender_icon.png 7 July, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రహరీ కూల్చివేతపై వివాదం

07-07-2025 01:18:23 AM

- అర్ధరాత్రి బాచుపల్లిలో కూల్చిన హైడ్రా 

- 650 కుటుంబాల ఆందోళన 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి):  హైడ్రా.. బాచుపల్లిలోని ప్రణీత్ ప్రణవ్ యాంటిలీయా విల్లాల ప్రహరీని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంతో తీవ్ర దుమారం రేపింది. దీంతో 650 కుటుంబాలు భయాందోళనలతో రోడ్డెక్కాయి. బాచుపల్లిలోని సర్వే నెం. 170, 170/1, 39 తదితర ప్రాంతాల్లో యాంటిలీయా బిల్డర్ అడ్డుగోడ కట్టారని, దీనివల్ల 100 అడుగుల రోడ్డుకు ఆటంకం కలుగుతోందని హైడ్రాకు ఫిర్యాదు అందింది.

ఈ ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా, కనీసం స్థానిక నిజాంపేట్ కార్పొరేషన్ లేదా హెచ్‌ఎండీఏ అధికారులతో సంప్రదించకుండా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పోలీసుల సహాయంతో ఆదివారం తెల్లవారుజామున ప్రహరీని నేలమట్టం చేయించారని బాధితులు వాపోతున్నారు. హెఎండీఏ మాస్టర్‌ప్లాన్ ప్రకారం తమ వెంచర్‌లో 100 అడుగుల రోడ్డే లేద ని, కేవలం 60 అడుగులు, 30 అడుగుల అంతర్గత రోడ్లు మాత్రమే ఉన్నాయని యాంటిలీయా వాసులు స్పష్టం చేస్తున్నారు. 

హైడ్రా ఏకపక్ష వైఖరికి నిరసనగా 600 మందికి పైగా విల్లాల యజమానులు శనివారం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే ఎలాంటి నోటీసులు లేకుండా గోడ కూల్చివేయడం దారుణమని, ఈ విషయంపై అధికారులతో చర్చించి, బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

సీఎం రేవంత్‌కు ఫిర్యాదు

హైడ్రా అధికారులు తమ పొరపాటును సరిదిద్దుకుని, కూల్చివేసిన గోడను తిరిగి నిర్మించాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అన్యాయంపై సీఎం రేవంత్‌రెడ్డి కి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారంతో రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కమ్యూనిటీ చెరువులోగానీ, బఫర్ జోన్‌లోగానీ లేదని చెప్పారు.