calender_icon.png 25 September, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణా జలాల వాటాపై తలో మాట

25-09-2025 12:38:32 AM

  1.   299 టీఎంసీల కృష్ణాజలాల్లో వాటా ఒప్పుకొని తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం
  2. సమ్మక్క సాగర్‌ను బీఆర్‌ఎస్ పూర్తిచేస్తే కాంగ్రెస్ డబ్బా ప్రచారం
  3. చంద్రబాబుకు భయపడి బనకచర్లపై మౌనం
  4.  మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): కృష్ణా జలాల్లో వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం ఎక్స్‌లో హరీశ్‌రావు స్పందిస్తూ.. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తర ప్రగల్భాలే పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల వాటాపై సీఎం రేవంత్‌రెడ్డి ఓ మాట, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేశామని, రైట్ షేర్ కోసం తానే స్వయంగా ట్రిబ్యునల్ ముందు అటెండ్ అయినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గొప్పలు చెప్పుకున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం గతంలో కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్‌వోసీ ఇచ్చి, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైన కట్టుకోండని చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చారని గుర్తు చేశారు.

ఇటీవల నీటి పారుదల శాఖ సమీక్షలో ఇదే సీఎం కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలని సూచించినట్టు వివరించారు. పూటకో మాట మాట్లాడి పరువు తీసుకుంటున్నారని, వీళ్ల అజ్ఞానం వల్ల తెలంగాణ రాష్ర్టం హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉందని తెలిపారు. 

అప్పుడు ద్రోహం.. ఇప్పుడు సుద్దులు

సీఎం, మంత్రి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, 299:512 హక్కుల విషయంలో తాము సంతకం పెట్టినట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేయాలని సవాల్ విసిరారు. కృష్ణాలో 299:512 వాటా ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని చారిత్రక ద్రోహం చేసిందని తెలిపారు. అడ్ హక్‌కు, ఫైనల్ అవార్డుకు తేడా తెలియని అజ్ఞానులు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి అని విమర్శించారు. రాష్ర్టం వచ్చిన 42 రోజుల్లోనే ఆనాటి కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని, కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కేంద్రాన్ని కోరినట్టు పేర్కొన్నారు. 

యూరియా కోసం ధర్నా చేస్తే పాపమా..

ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు నల్లగొండ జిల్లాలో జరిగిన ఘటన మరో నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. బుధవారం ఎక్స్ వేదికగా ఆయన స్పం దిస్తూ.. యూరియా కావాలంటూ ధర్నాలో పాల్గొనడమే ఈ గిరిజన యువకుడు చేసిన పాపమా, కులం పేరుతో దూషిస్తూ పోలీసు స్టేషన్‌కు లాక్కెళ్లి, కాళ్లు కట్టేసి లాఠీలతో బాదడమే ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. యూరియా అడిగిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేనా.. ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డికి అధికారం రావడం అంటే.. అరాచకానికి అధికారం తోడైనట్టు ఉందని విమర్శించారు.

ఆల్మట్టి ఎత్తు పెంపుపై మౌనమెందుకు.. 

ఆల్మట్టి ఎత్తు పెంపు అంశంలో తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ కలిసి చేస్తున్న ద్రోహమిదని తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ, బీహార్‌కు వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని కర్ణాటక మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం 100 టీఎంసీల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడం లేదని, కృష్ణా జలాల్లోని తెలంగాణ హక్కును బొందపెట్టి, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డిలను ఎడారులుగా మార్చేందుకు కర్నాటక కాంగ్రెస్ పన్నుతున్న కుట్ర పన్నుతుందని వివరించారు.