25-09-2025 12:29:13 AM
తాండూరు, 24 సెప్టెంబర్, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం గాజీపూర్ మరియు బుద్ధారం రోడ్లు అద్వాన్నంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు తిరిగి ఇంటికి చేరుకునే వరకు భయం భయంగానే ప్రయాణం కొనసాగిస్తూ ప్రతినిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే తాండూర్ నుండి సంగారెడ్డి వెళ్లే రహదారి మధ్యన ఉన్న పెద్దేముల్ మండలం గాజీపూర్ బ్రిడ్జి మరియు బ్యారేజ్ నిర్మాణం గత రెండేళ్ల క్రితం పూర్తయింది.
అయితే ఈ బ్రిడ్జికి అనుసంధానం చేసే రోడ్డు నిర్మాణం మాత్రం తారు (డాంబర్) వేయాల్సి ఉండగా మొరం మట్టి వేయడంతో చినుకు పడితే చాలు రోడ్డంతా బురదమయంగా మారుతుంది. కార్లు, ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఇక్కడ ఉన్న కిలోమీటర్ దూరం వరకు ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సిందే. అత్యవసర సమయంలో అంబులెన్స్ వెళ్లాలన్నా కూడా 10 నుండి 20 నిమిషాల సమయం పడుతుంది.
రోడ్డుపై ఉన్న గుంతల్లో చేరిన నీరు బురద మయంగా మారిన రోడ్డుతో ప్రయాణికులు ప్రయాణం చేయాలంటే భయంతో వణికి పోతున్నారు. ఇంత దారుణంగా మారిన ఈ రోడ్డును మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన పాలకులు పట్టించుకోవడంలేదని .. సంబంధిత రోడ్లు మరియు భవనాల శాఖ అధికారుల సైతం చూసి చూడనట్లు... తెలిసి తెలియనట్లు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు స్థానికులు ఆరోపిస్తున్నారు..
ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఈ రోడ్డుపై తారు (డాంబర్) వేయాలని కోరుతున్నారు. ఈ విషయమై ఆర్ అండ్ బి ౄE శ్రావణ్ కుమార్ ని వివరణ కోరగా బ్రిడ్జి నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయాలని కోరామని అతడి ద్వారా ఎటువంటి స్పందన రావడంలేదని వారం పది రోజుల్లో వర్షాలు తగ్గితే పనులు ప్రారంభిస్తామని అన్నారు.