calender_icon.png 15 October, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

14-10-2025 10:25:39 PM

గజ్వేల్ ఏఎంసి మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్

గజ్వేల్ (విజయక్రాంతి): అనేక కష్టాల నడుమ ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసే కేంద్రాలను ప్రారంభించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు మక్కలు కొనుగోలు చేయాలని గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గజ్వేల్ లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మొక్కజొన్న పంట కోతకు వచ్చి రోడ్లపై మక్కలు ఆరబోసి మద్దతు ధర కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు నిరాశనే ఎదురవుతుందన్నారు. అకాల వర్షాలతో పంట సరైన దిగుబడి రాక బాధ పడుతున్న రైతులకు బహిరంగ మార్కెట్లో ధర లేకపోవడం పంటను కోసి పదిహేను రోజులు దాటినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నలకు క్వింటాలుకు రూ. 2400 రూపాయలు ధర నిర్ణయించినప్పటికీ, ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు 400-500రూపాయలు రైతులు నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల గానీ, వ్యవసాయంపట్ల గానీ ప్రాధాన్యత లేదని నిరూపితం అయిందన్నారు. రైతులు ఒకవైపు యూరియా కోసం పడరాని పాట్లు పడిన రోజులు మరువక ముందే మరోవైపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని అన్నారు. ప్రభుత్వానికి ఏ మాత్రం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నా వెంటనే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర అందించి కొనుగోలు చేయాలని లేని పక్షంలో రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అయన వెంట మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, నాయకులు ఉమర్, శివకుమార్, నిజామోద్దీన్ తదితరులు ఉన్నారు.