31-10-2025 12:57:14 AM
 
							- ప్రకృతి వైపరీత్యం.. కాపాస్ కిసాన్ యాప్ ఇబ్బందులు
- పత్తి విక్రయానికి తప్పని తిప్పలు..
కొమురవెల్లి, అక్టోబర్ 30: ప్రకృతి రైతుల జీవితాలతో ఆటలాడుకుంటుంది. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నకు చివరకునిరాశే మిగులుతుంది. అయితే అనావృష్టి లేకపోతే అధికవృష్టి ఇది ఏటా జరిగే తంతే అయిన, వీటన్నిటిని దాటుకొని చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి నా నా తంటాలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోం ది. ఈ ఏడాది వర్షాలు అధికంగా కూరియడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధికంగా కురిసిన వర్షాలకు పత్తి చేనులు బాగా పెరిగిపోయి, దిగుబడి బాగా తగ్గింది. చెట్టు బాగా పెరగడంతో కాయలు తక్కువ కాసింది. దీనికి తోడు భారీ వర్షాల వల్ల చేన్ల ల్లో నీరు నిలిచి పత్తి మొక్కలు ఎర్రబడడం కూడా దిగుబడి తగ్గడానికి కారణమైంది. ఏకధాటిగా కురిసిన వర్షాల పత్తి చేలల్లో కలుపు తీయకపోవడం చేనులలో గడ్డి పెరిగిపోయి, మొక్కలు ఎదగలేకపోయాయి. ఈ విధంగా కూడా రైతు నష్టపోయారు.
సాధారణంగా పత్తి పంట ఎకరాకు 6 నుండి 12 క్వింటాల్స్ వరకు రావాల్సిన దిగుబడి, మూడు నుంచి 6 క్వింటాల్ లకు పరిమితమైంది. సగానికి సగం దిగుబడి తగ్గడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 1.07 లక్షల ఎకరాలో రైతులు పత్తి పంటను సాగు చేశారు. అనేక కష్టాలకు కోర్చి పంటను పండించిన కర్షకునికి పంటను అమ్ముకోవడానికి కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. పత్తి పంట అ మ్మకాలకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనతో అన్నదాతలు అయోమయం చెందు తున్నారు. పత్తి విక్రయాలకు’ కాపాస్ కిసాన్ యాప్ ’ ద్వారానే విక్రయాలు చేయాలని నిబంధన పెట్టింది. సాగుదారులు కచ్చితం గా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని తమ పేర్లు, సాగు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వారికి దానిపై అవ గాహన లేక నేటికీ దూరంగా ఉన్నారు. అవగాహన లేమి తో పాటు, నిరక్షరాస్యత కారణంగా తమ పంటను అమ్ముకోవడం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే సీసీఐ జిల్లాలో 22 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసింది. ఇటీవల పలు జిన్నింగ్ మిల్లులలో ఎంపీ రఘునందన్ రావు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
యాప్ డౌన్లోడ్
యాప్ డౌన్లోడ్ చేయడమే రైతన్నకు పెద్ద ఇబ్బంది. ఎందుకు అనగా రైతుల్లో సగానికి సగం రైతులు నిరక్షరాస్యులు వీరికి ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియదు. తొలత కపాస్ కిసాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. (ఇంతకుముందే ఈ యాప్ కు వ్యవసాయ శాఖ వారు చేపట్టిన పంట నమోదుకు అనుసంధానించి, రైతు సెల్ నెంబర్ ను పొందుప రిచారు.) యాప్ ను ఓపెన్ చేసి రైతు తన ఫోన్ నెంబర్ నమోదు చేస్తే ఓటిపి వస్తుంది. దానిని నమోదు చేయాలి. తర్వాత చేంజ్ ప్రొఫైల్, రిజిస్టర్ డీటెయిల్స్, బుక్ స్లాట్, భూమి నమోదు, స్లాట్ సమాచారం తదితర వివరాలు నమోదు చేయాలి. ఆ తరవాత స్లాట్ తేదీ, ఏ జిన్నింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలో ఫోన్లో డిస్ప్లే అవుతుంది. ఆ రోజు నా డు, ఆ కేంద్రానికి రైతులు తమ పంటను తీసుకెళ్లాలి. ఇవన్నీ నమోదు చేయాలంటే రైతుకు యాప్ పై కనీస అవగాహన కలిగి ఉండాలి.
రైతుల వద్ద సాధారణ సెల్ ఫోన్లు
చాలామంది రైతుల వద్ద సాధారణ( డబ్బా ) సెల్ ఫోన్ లే ఉన్నాయి. వీటితో’ కాపాస్ కిసాన్’ యాప్ డౌన్లోడ్ చేసుకోలేని పరిస్థితి నెలకొంటుందని రైతుసంఘాల నా యకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు లేని రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గా న్ని కనిపెట్టాలని వారు సూచిస్తున్నారు.
ఆధార్ లింక్
పత్తి పంటను అమ్ముకునే రైతులు ఆధార్ కార్డు కలిగి ఉండాలని సీసీఐ అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్, బ్యాం క్ అకౌంట్ నెంబర్ లింక్ అయి ఉండాలి. దాంతోపాటు బయోమెట్రిక్, ఐరిస్ అప్డేట్ అయి ఉంటేనే ఆ అకౌంట్లో డబ్బులు జమవుతాయని సంబంధిత అధికారులు తెలుపు తున్నారు. అందుకనే ముందుగానే పత్తి అమ్మాలనుకునే రైతులు ఆధార్ కు ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏఈఓ ల ద్వారా ధ్రువీకరణ
పత్తి పంట పండించిన రైతు సంబంధిత ఏఈ ఓల దగ్గరికి వెళ్లి తమకు ఎంత భూమి ఉందో, ఎన్ని ఎకరాలలో పత్తి సాగు చేశారో, ఎంత దిగుబడి వస్తుందో తదితర విషయాల ను క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగా ఏ ఈ ఓ నుంచి తప్పనిసరిగా ధ్రువీకరణ చేసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు
. సీసీఐ కొర్రీలు
తడిసిన, రంగు మారిన, నాణ్యతలేని పత్తిని సీసీఐ కేంద్రాలలో కొనుగోలు చేయవద్దని సిసిఐ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా తేమశాతం 8 శాతానికి తగ్గకుండా,12 శాతానికి మించకుండా పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆదేశిస్తున్నట్టు తెలిసింది.
మద్దతు ధర@8110
సిసిఐ( కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి పింజపొడుగును బట్టి గరిష్టంగా క్వింటాకు రూ. 8110 మద్దతు ధర ప్ర కటించింది. సీసీఐ మద్దతు ధర ప్రకటించినప్పటికీ జిన్నింగ్ మిల్లు దారులు సీసీఐ అధికారులు కుమ్ముక్కై ధరవిషయంలో అవకతవకలకు పాటుపడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.జిల్లా కలెక్టర్ దృష్టి సారించి, ఎప్పటికప్పుడు మానిట రింగ్ చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. రైతులకు పెట్టుబడులు పెరిగి, దిగుబ డి తగ్గిందని, వాటి అనుగుణంగా మద్దతు ధర మరింత పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలను సరళతరం చేయడంతో పాటు పత్తి అమ్ముకునే రైతులకు అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు యాప్ పై అవగాహన
రైతులకు కాపాస్ కిసాన్ యాప్ పై అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి వెంకటరావమ్మ తెలిపారు. సి సి ఐ నోటిఫై చేసిన కేంద్రాలలోనే రైతులు తమ పంటను అమ్ముకుంటేనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని, దళారుల బారిన పడొద్దని ఆమె తెలిపారు.త్వరలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. యాప్ డౌన్లోడ్, వివరాల నమోదుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఏఈఓ లను సంప్రదించాలని ఆమె సూచించారు.