31-10-2025 01:09:43 AM
 
							తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం : డీఏవో దేవ్కుమార్
కొల్చారం, అక్టోబర్ 30 :మొంథా తుఫాన్ కారణంగా కురిసిన వర్షానికి కొల్చారం మండలంలో ధాన్యం తడిసిపోయిన విషయాన్ని తెలుసుకున్న మెదక్ జిల్లా వ్యవసాయాధికారి దేవ్కుమార్ గురువారం మండలంలో పర్యటించారు. గురువారం విజయక్రాంతి దినపత్రికలో అన్నదాత గుండెల్లో తుఫాన్ అనే కథనానికి స్పందించిన ఆయన రంగంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.
30 శాతం ఉప్పు ద్రావణాన్ని తడిసిన ధాన్యంపై పిచికారి చేస్తే మొలకలు రావని రైతులకు తెలిపారు. తుఫాను దృష్ట్యా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ మండల వ్యవసాయ అధికారి రైతులకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహించారని రైతులు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు.
గత నెలలో వచ్చిన మంజీరా వరదల వల్ల జరిగిన పంట నష్టం వివరాలు జిల్లా అధికారులకు నివేదిక సమర్పించడంలో కొల్చారం ఏవో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. రైతులు ఆధైర్య పడొద్దని తడిసిన రంగు మారిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి, రంగంపేట సీఈవో నవీన్, సిబ్బంది దుర్గేష్, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.