calender_icon.png 26 October, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు భయపడే గుట్టు చప్పుడు కాకుండా పత్తి కొనుగోళ్లు ప్రారంభం

25-10-2025 08:19:32 PM

బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ల తీరుపై మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజం

కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులకు నష్టం

ఆదిలాబాద్,(విజయక్రాంతి): గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి కొనుగోళ్లను గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభించడంలో ఆంతర్యం ఏమిటి, రైతులకు భయపడే కొనుగోళ్ళ ప్రక్రియను చేపట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న ఆరోపించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పత్తి కొనుగోళ్లను ముహూర్తం సాకు చూపి ప్రారంభించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏళ్ళుగా స్థానికంగా వస్తున్న పద్దతిని విస్మరించడం సరికాదని, ఎంపీ, ఎమ్మెల్యేలు రైతులకు భయపడే కొనుగోళ్లను గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభించారని మండిపడ్డారు.

ఎమ్మెల్యేకు ఎన్నికలు ముఖ్యమా, రైతులు ముఖ్యమా అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో వర్షంతో తడిసిన పంటలను సైతం పూర్తి మద్దతు ధరతో కొనుగోలు చేశామని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని మండలాల నుండే రైతులను పిలిపించి కొనుగోళ్లను ప్రారంభించడం సరికాదని, ఇప్పటికైనా 27 నుండి పూర్తిస్థాయిలో కొనుగోళ్ళు ప్రారంభం అవుతున్నాయో లేదో కలెక్టర్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందన్నారు.

కపాస్ కిసాన్ యాప్ ద్వార ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. యాప్ గురించి కనీస అవగాహన లేని రైతులు ఏ విధంగా వినియోగించుకుంటారన్నారు. ఇప్పటికీ యాప్ ఓపెన్ కావడం లేదని, ఈ విషయంలో రైతుల సందేహాలను తీర్చే బాధ్యత ఎవరిదని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు రైతులకు భయపడే పత్తి కొనుగోళ్ళు అంటేనే వెనకడుగు వేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తేమ శాతం నిబంధనలను సడలించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో ఎంపీ, ఎమ్మెల్యే విఫలమయ్యారని మండిపడ్డారు.