29-10-2025 07:52:31 PM
- ప్రేమలోనే కాదు, చావులో కూడా ఒక్కటయ్యారు
- శోకసంద్రంలో మునిగిన ఆరుట్ల గ్రామం
ఇబ్రహీంపట్నం: కలిసి కలకాలం జీవించాలని ప్రేమించుకున్న ఓ ప్రేమజంట అర్థంతరంగా చనువు చాలించి, చావులో కూడా ఒక్కటయ్యారు. ఈ హృదయవిదారక ఘటన రంగారెడ్డి జిల్లా, మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఆరుట్ల గ్రామానికి చెందిన మంకు లక్ష్మమ్మ, పోచయ్య అనే దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు. చిన్న కుమారుడైన మంకు నాగరాజు(24), అదే గ్రామానికి చెందిన పంబల దుర్గేష్, సంతోష్ దంపతుల కుమార్తె అయిన పంబల నందిని(19) వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా ఈ నెల 27న నందిని ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో 28వ తేదీన నందిని కుటుంబ సభ్యులు బంధువులు కలిసి మంచాల పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.
అనంతరం బాధిత కుటుంబానికి పరిహారాన్ని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదిలా ఉండగా.. నందిని మరణవార్త తెలుసుకున్న నాగరాజు మనస్థాపానికి గురై, ఆగపల్లీలోని తన అక్క వద్దకు వెళ్ళిన అతను, బుధవారం ఉదయం ఆగపల్లీ నుండి పెత్తుళ్ల గ్రామం వెళ్ళే రోడ్ సమీపులోని ఓ చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం గొర్రెల కాపరి మృతదేహాన్ని చూసి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమజంట మృతి చెందటంతో ఆరుట్ల గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. బుధవారం గ్రామంలో నందిని అంత్యక్రియలు జరిగాయి. నేడు నాగరాజు అంత్యక్రియలు జరుగనున్నాయి.