29-10-2025 07:56:28 PM
చిట్యాల (విజయక్రాంతి): మహిళపై దాడి చేసి గాయపరిచిన కేసులో ఆరుగురికి సంవత్సరం జైలు శిక్షను విధిస్తూ రామన్నపేట అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్ జడ్జి ఎస్. శిరీష బుధవారం తీర్పునిచ్చారు. వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019 సంవత్సరంలో నమోదైన కేసులో, నర్సాపురం గ్రామానికి చెందిన కవాటి మహేశ్, కవాటి నరేశ్, కవాటి శివ, ఎనుగుల ఉప్పలయ్య, జక్కుల రామకృష్ణ, కవాటి సుధర్షన్ అనే ఆరుగురు నిందితులు మహిళపై దాడి చేసి, గాయపరిచిన సంఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పి. శివనాగ ప్రసాద్, (ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నాగోల్ పోలీస్ స్టేషన్) దర్యాప్తు చేసి ఆధారాలను సేకరించి, సాక్ష్యాలతో కోర్టులో చార్జ్‌షీట్ సమర్పించారు.
బుధవారం విచారణ పూర్తయి, అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు రామన్నపేట జడ్జి యస్. శిరీష నిందితులందరినీ దోషులుగా నిర్ధారించి, ప్రతి ఒక్కరికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.500/- జరిమానా విధించింది. ఈ కేసు విచారణలో ఏపీపీ పి. వెంకట అవినాష్ సమర్థంగా వాదించారు. కేసు విజయవంతంగా పూర్తికావడంలో సహకరించిన సిడిఓ ఏ. రామచారి, పీసీ 3060 వలిగొండ పోలీస్ సిబ్బందిని అభినందించారు.