28-01-2026 01:27:55 AM
మానవ ప్రమేయం లేకుండా డ్యూటీలు కేటాయింపు
అత్యాధునిక జనరేటివ్ ఏఐని ప్రారంభించిన సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 27 (విజయక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పు డూ ముందుండే హైదరాబాద్ పోలీస్ విభా గం మరో మైలురాయిని అధిగమించింది. సి టీ ఆర్మ్డ్ రిజర్వ్ సీఏఆర్ సిబ్బందికి విధులను కేటాయించే ప్రక్రియలో ఇకపై పైరవీ లకు, జాప్యానికి తావులేకుండా జనరేటివ్ ఏఐ విధానాన్ని ప్రవేశపెట్టింది. మంగళవారం బషీర్‌బాగ్‌లోని పాత కమిషనర్ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జ నార్ ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించారు.
ఏమిటీ జనరేటివ్ ఏఐ విధానం..
గతంలో మాన్యువల్ పద్ధతిలో విధులను కేటాయించడం వల్ల సమయం వృథా కావడంతో పాటు పారదర్శకతపై సిబ్బందిలో కొన్ని సందేహాలు ఉండేవి. వీటన్నింటికీ చెక్ పెడుతూ హన్ష ఈక్విటీ పార్ట్‌నర్స్ సహకారంతో కేవలం రెండు నెలల్లోనే ఈ ఏఐ వ్యవస్థను రూపొందించారు.హంగేరియన్ మెథడ్ అనే సాంకేతికత ద్వారా సిబ్బంది సీనియారిటీ, వారు రిజర్వ్‌లో ఉన్న రోజులు, గతంలో అందుకున్న రివార్డులు, వారి క్రమశిక్షణ ,ఆరోగ్య పరిస్థితిని బట్టి కంప్యూటరే ఆటోమేటిక్‌గా స్కోరు కేటాయిస్తుంది.
ఓపెన్ ఏఐ సాయంతో డ్యూటీ అలాట్‌మెంట్ ఆర్డర్లు క్షణాల్లో సిద్ధమవుతాయి. దీనివల్ల అధికారుల ప్రమేయం లేకుండా, అర్హత ఆధారంగానే పోస్టింగ్‌లు లభిస్తాయి.సిబ్బందికి తమ విధులపై ఎలాంటి సందేహాలున్నా నివత్తి చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏఐ చాట్ బాట్ ను అందుబాటులోకి తెచ్చారు.ఈ విధానం ద్వారా ఇప్పటికే 1,796 దరఖాస్తులను పరిశీలించి, అందులో 208 కీలక డ్యూటీలను సెక్రటేరియట్, సీఎం ఆఫీస్, ట్రాఫిక్, ఇంటర్‌సెప్టర్ వాహనాలు..విజయవంతంగా కేటాయించినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు.
పోలీస్ సిబ్బందిపై మానసిక ఒత్తిడి తగ్గించి, వారిలో ఉత్సాహాన్ని నింపడమే ఈ ఏఐ విధానం ముఖ్య ఉద్దేశం అన్నారు. సిబ్బంది పనితీరు, ఆరోగ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. జవాబుదారీతనంతో కూడిన ఈ వ్యవస్థ వల్ల పోలీసులు శాంతిభద్రతలపై మరింత ఏకాగ్రత పెట్టే అవకాశం ఉంటుంది” అని పేర్కొన్నారు. ఈ విధానం రూపకల్పనలో కృషి చేసిన త్రినాథ బాబు, సునీల్ రేగులలను ఆయన అభినందించారు.ఈ కార్య క్రమంలో అదనపు సీపీలు ఎం.శ్రీనివాస్, తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు జోయల్ డేవిస్, శ్వేత, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ ఆర్.వెంకటేశ్వర్లు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ ద్వారా జనరేట్ అయిన డ్యూటీ ఆర్డర్లను కానిస్టేబుళ్లకు అందజేశారు.