సామాన్యుడిలా సీపీ సజ్జనార్ ప్రయాణం
- సివిల్ డ్రెస్‌లో బైకుపై చక్కర్లు
- కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పరిశీలన
- విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో మాటామంతి
- వన్ వే విధానానికి సహకరించాలని విజ్ఞప్తి
బంజారాహిల్స్,ఆగస్టు 20(విజయక్రాంతి):ఇటీవల కేబీఆర్ పార్కు పరిసరాల్లో వన్ వే ట్రాఫిక్ విధానం అమలులోకి తీసుకొచ్చారు. దీంతో వాహనదారులు కొందరు అయోమయానికి గురవుతున్నారు.పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఆ సమస్యలను స్వయంగా తెలుసుకొనేందుకు గురువారం హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు.తాను ఒక సాధారణ వాహనదారుడి అవతారం ఎత్తారు. సివిల్ డ్రెస్ వేసుకొని బైకుపై కేబీఆర్ పార్క్ పరిసరాల్లోని ప్రధాన రహదారుల్లో చక్కర్లు కొట్టారు.ఎటువంటి హడావుడి లేకుండా ట్రాఫిక్ సరళిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ చక్కర్లు..
సీపీ సజ్జనార్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లోని రోడ్ నంబర్ 45 నుంచి జూబ్లీ చెక్పోస్ట్, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్ధ జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్నగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్డు నంబర్ 45 వరకు రెండు సార్లు బ్పై తిరుగుతూ ట్రాఫిక్ ను పరిశీలించారు. అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్నగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీ చెక్పోస్ట్, కేబీఆర్ పార్కు ప్రధాన గేటు తదితర కూడళ్ల వద్ద విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం సాఫీగా రాకపోకలు సాగుతున్నాయి..
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ సాఫీగా సాగుతోందని సీపీ సజ్జనార్ తెలిపారు. బుధవారం నుంచి వన్వే విధానాన్ని అమలులోకి తెచ్చామన్నారు. మొదటి రోజు లేన్ల మార్పిడి విషయంలో వాహనదారులు కాస్త అయోమయానికి గురైనప్పటికీ గురువారం నాటికి రాకపోకలు పూర్తిగా సాఫీగా సాగుతున్నాయని వెల్లడించారు. వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జంక్షన్లలో స్పష్టమైన సైన్బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు తగినంత మంది సిబ్బందిని కూడా మోహరించినట్లు వివరించారు.
పనులు పూర్తయ్యే వరకు సహకరించాలి..
జీహెచ్‌ఎంసీ, నిర్మాణ ఏజెన్సీతో సమన్వయం చేసుకుంటూ హెచ్-సిటీ ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీపీ చెప్పారు. పనులు పూర్తయ్యేంత వరకు నగరవాసులు, వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని కోరారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.






