20-09-2025 08:01:23 PM
స్వామివారి బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు పోలీస్ కమిషనర్ సాయిచైతన్య వెల్లడి..
భీమ్ గల్ (విజయక్రాంతి): రాబోయే లింబాద్రి గుట్ట జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక సూచనలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నరసింహస్వామి ఆలయాన్ని స్వామివారిని సీపీ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ సంబంధిత అధికారులకు ఆలయ భద్రత గురించి స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ అమలు చేయడంతో పాటు, పార్కింగ్ ప్రాంతాలను సక్రమంగా గుర్తించి భక్తులను సులభంగా గమ్యస్థానానికి చేర్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక సిబ్బందిని ఆదేశించారు.
భక్తులకు తాగునీరు, వైద్య సహాయం, లైటింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతోపాటు ఇబ్బందులు ఎదురవకుండా అనుమానాస్పదంగా కనిపించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా భక్తులకు మార్గదర్శనం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ జాతర విజయవంతంగా, శాంతియుతంగా నిర్వహించబడేందుకు పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ, స్థానిక సంస్థల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా భీంగల్ సీఐ శ్రీ సత్యనారాయణ , భీంగల్ ఎస్సై శ్రీ సందీప్ ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు సిపి తో పాటు ఉన్నారు.