26-12-2025 03:28:55 PM
ముత్తారం,(విజయక్రాంతి): కమీషన్ కు కక్కుర్తి పడి నాసిరకం పనులు చేయింది నువ్వు కాదా పుట్ట మధు అని ముత్తారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీతో కలిసి మాట్లాడారు. బుధవారం మంథని లో పుట్ట మధు చేసిన వాక్యాలపై ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో నీటి నిలువల అభివృద్ధిపై ఆలోచన చేసే గొప్ప నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి నిలువల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించిన నాయకుడు శ్రీధర్ బాబు అని, ముత్తారం, ప్రాంత ప్రజలకు మేలు చేసేలా మంత్రి నిధులు తీసుకు వస్తున్నారని, అ అభివృద్ధి చూసి ఓర్వలేక పుట్ట మధు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, నియోజకవర్గంలో మీ హయాంలో నిర్మించిన చెక్కు డ్యాములను నీ అనుచరులే పీల్చివేసినట్టు అనుమానం ఉందన్నారు. మా ప్రభుత్వం పై బురద జల్లాలని, శ్రీధర్ బాబు, శ్రీను బాబు ల పై అసత్య ఆరోపణలు చేస్తున్నావని, మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా నడిపించి కమిషన్లకు కక్కుర్తి పడి ఇసుక లారీలు నడిపించారని మండిపడ్డారు.
చెక్ డ్యాములు కట్టేటప్పుడు ఇసుకను పూర్తిస్థాయిలో తీసి పునాది కడితేనే దృఢంగా ఉంటాయని, అది ముందు తెలుసుకోక నాణ్యత లేని చెక్ డ్యాములు కట్టి ప్రభుత్వాన్ని వేలాది కోట్ల రూపాయలు నష్టానికి గురిచేసి, నష్టంపై మీరు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నాసిరకం పనులు చేసింది నువ్వు కాదా పుట్ట మధు? అని ప్రశ్నించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.