08-07-2025 10:57:13 PM
ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు..
ఎల్బీనగర్: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ దగ్గర గంజాయి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని ఎల్బీనగర్ పోలీసులు(LB Nagar Police) అరెస్టు చేశారు. వీరి నుంచి 1182 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన యంగల నరేంద్ర(25) నిజాంపేట్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఉంటూ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రానికి చెందిన కొంతం నితిన్ అలియాస్ చింటూ(22) జేఎన్టీయూ పరిధిలోని ఇంద్రహిల్స్ కాలనీలో ఉంటూ చదువుకుంటున్నాడు. వీరిద్దరూ స్నేహితులుగా మారి మత్తు పదార్దాలకు బానిసయ్యారు.
సులభంగా డబ్బు సంపాదించాలని ఒడిశా నుంచి గంజాయిని తీసుకుని వచ్చి, విక్రయిస్తున్నారు. మంగళవారం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ దగ్గర సవేరా వైన్స్ వీధిలో గంజాయిని విక్రయించాలని ప్రయత్నిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వీరివద్ద నుంచి 1182 గ్రాములు గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ సప్లయర్ కొరకు పోలీసులు వేట ప్రారంభించారు.