క్రెడిట్ సీఎంకు.. వేటు అధికారిపైనా!
- ఎఫ్‌ఐఆర్‌ల ఘనత తనదేనంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం
- కేసు నమోదు చేసిన అధికారిపైనే చర్యలు
- రేవంత్ వైఖరి దొంగే దొంగ అని అరిచినట్లుంది
- అధికారులను శిక్షించడమే ప్రభుత్వ విధానమా?
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఖరి దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాతో పాటు పలువురు సోషల్ మీడియా అకౌంట్ నిర్వాహకులపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలో తన ప్రభుత్వానిదే ఘనత అన్నట్లుగా చెప్పుకోవడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమన్నారు.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బహిర్గతం చేస్తోందని గురువారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ చేసిన, అసభ్యకరమైన, అభ్యంతరకరమైన సోషల్ మీడియా పోస్టులపై తెలంగాణ బీజేపీ కార్యకర్తలు అధికారికంగా ఫిర్యాదులు చేయడంతో ఈ కేసులు నమోదయ్యాయన్నారు.
ఆ ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), సమాచార సాంకేతిక చట్టం (ఆర్‌టీఐ)లోని సంబంధిత నిబంధనల కింద రెండు కేసులను నమోదు చేశారని రాంచందర్‌రావు తెలిపారు. బీజేపీ కార్యకర్తల ఫిర్యాదుతో పోలీసులు తమ చట్టబద్ధమైన విధి నిర్వహణలో భాగంగా చేపట్టిన చర్యలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆ ఘనతను ఆపాదించుకునే నైతిక హక్కు ఏమాత్రం లేదన్నారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు సీఎం రేవంత్‌రెడ్డి తన ఘనతే అని చెప్పుకుంటే కేసులునమోదు చేసిన మరుసటి రోజే హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్‌బాబును బాధ్యతల నుంచి ఎందుకు తప్పిం చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ల నమోదును సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించి సమర్ధిస్తే .. ఆ కేసుల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారిని వెంటనే ఎందుకు తొలగించారు ? ఆ పోలీసు అధికారినే శిక్షించడాన్ని ఎలా సమర్థించుకుంటారు? అని ప్రశ్నించారు.
అధికారులను ఇష్టానుసారంగా బాధ్యతల నుంచి తొలగించడం, తరచూ బదిలీలు చేయడం, తెలంగాణ పరిపాలనా వ్యవస్థ స్వతంత్రతను, అధికారుల మనోధైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. ఘనతను మాత్రం తమ ఖాతాలో వేసుకోవడం.. విధులు నిర్వహించిన అధికారులను శిక్షించడమే ప్రభుత్వ విధానమా? అని ఆయన నిలదీశారు.






