calender_icon.png 31 December, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2025 నేర చరిత్ర.. 4% పెరిగిన కేసులు

31-12-2025 12:00:00 AM

  1. స్వల్పంగా తగ్గిన చోరీలు,మహిళలపై అఘాయిత్యాలు

భారీగా జరిమానాలు

బెల్టు షాపులపై స్పెషల్ డ్రైవ్ 

సిద్దిపేట క్రైం, డిసెంబర్ 30 : గతేడాదితో పోలిస్తే సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. 2024లో 6,853 కేసులు నమోదుకాగా, ఈ సంవత్సరం 7,144 కేసులు నమోదయ్యాయి. అంటే 4% పెరిగా యి. హత్య కేసుల్లో 12% తగ్గాయి. 2024లో25 హత్య కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 22నమోదయ్యాయి. ఆస్తి కోసం జరిగిన హత్యల కేసులు 3 నుంచి 5కు పెరిగాయి.

దోపిడీ కేసులు 7 నుంచి 12కుపెరిగాయి. దొంగతనం కేసులు 260 నుండి 231కి తగ్గాయి. చైన్ స్నాచింగ్ కేసులు 9 నుండి 13కి పెరిగాయి. సాధారణ దొంగతనం కేసులు488 నుంచి 481కి తగ్గాయి. ఈ సంవత్సరం మొత్తం 731 ఆస్తి సంబంధిత నేరాల కేసులు నమోదూకాగా,రూ. 5,07,67,840/- విలువైన ఆస్తి నష్టం జరిగింది. అందులో రూ. 1,42,69,301/- విలువైన ఆస్తిని రికవరీ చేశారు.

రికవరీ రేటు 28%, కేసుల చేధన రేటు 41%గా ఉంది. గుర్తించని అన్ని కేసులలో చేధన, రికవరీ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అత్యాచార కేసులు 80 నుంచి 53కు (34% తగ్గుదల)తగ్గాయి. పోక్సో కేసులు 97 నుంచి 79కి తగ్గాయి. మహిళలపై నేరాల కేసులు 589 నుంచి 572కి తగ్గాయి.

ఈ సంవత్సరం 77 జూదం కేసులు నమోదు చేసిన పోలీసులు రూ.11,25,700/- స్వాధీనం చేసుకున్నారు. 440 ఎక్సైజ్ కేసులు, 203 అక్రమ ఇసుక రవాణా కేసులు నమోదయ్యాయి.జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ఎన్డీపీఎస్ చట్టం కేసులు 49 నుంచి 41కి తగ్గాయి. జిల్లాలో ఈ సంవత్సరం క్రిమినల్ కేసులలో మొత్తం శిక్షల రేటు 42 శాతంగా ఉంది.

రోడ్డు ప్రమాదాలు... జరిమానాలు 

ఈ సంవత్సరం 716 రహదారి ప్రమాద కేసులు నమోదయ్యాయి. 274మంది మృతి చెందగా, 599 మందికి గాయా లయ్యాయి. గతేడాది 718 కేసుల్లో మృతుల సంఖ్య 315కాగా, 645మంది గాయపడ్డారు. ట్రాఫిక్ నిబంధనల అమలును ముమ్మరం చేసి, 4,52,776 కేసులు నమోదు చేసి, రూ. 16,73,29,000 జరిమానా విధించారు. గత ఏడాదితో పోలిస్తే 14% పెరిగింది.

రాజీవ్ రహదారిపై స్పీడ్ లేజర్ గన్ ద్వారా తనిఖీలు నిర్వహించి, 61,147 అతివేగపు కేసులు నమోదు చేసి, రూ. 6,32,67,845 జరిమానా విధించారు.ఈ సంవత్సరం 15,323 కేసులు నమోదు చేయగా, 219 మందికి జైలు శిక్ష పడింది. కాగా 2024లో 33 మందికి జైలు శిక్ష పడింది.

కమ్యూనిటీ పోలీసింగ్

కమిషనరేట్ పోలీసులు ఈ సంవత్సరం 46,123 డయల్ 100 కాల్స్కు హాజరయ్యారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడానికి ఈ ఏడాది 16 కార్డన్ అండ్ సెర్చ్ (నాకా బందీ) ఆపరేషన్లు చేపట్టాడు. సైబర్ మోసాలు, రహదారి భద్రత, బాల్య వివాహాలు వంటి వివిధ సమస్యలపై అవగాహన కల్పించడానికి జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామాలు, విద్యా సంస్థలలో మొత్తం 360 కళాబృందం కార్యక్రమాలు నిర్వహించారు.

ఈవ్ టీజింగ్ సంఘటనలు తగ్గాయి. ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించిన 337 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రతి శనివారం కమిషనర్ పౌరులతో నిర్వహించే ’ఫోన్-ఇన్’ మంచి స్పందన లభించింది మంచి స్పందన లభించింది. కమిషనరేట్ కార్యాలయానికి రాలేకపోయిన చాలా మంది తమ సమస్యలను ఫోన్ ద్వారా తెలియజేశారు. మొత్తం 85 కాల్స్కు సీపీ స్వయంగా సమాధానమిచ్చారు. అన్ని ఫిర్యాదులపై అవసరమైన చర్యలు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా నిర్దేశిత సమయంలో 9,400 పాస్పోర్ట్ వెరిఫికేషన్ విచారణలను ప్రత్యేక బృందాలు పూర్తి చేశాయి.

మెరుగైన సేవలే లక్ష్యం

కొత్త సంవత్సరంలో పారదర్శకమైన, అవినీతి రహిత, బాధ్యతాయుతమైన సేవలను అందించడమే తమ లక్ష్యమని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. పట్టణ పౌరుల అంచనాలను అందుకోవడానికి కృషి చేస్తామన్నారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.