15-10-2025 12:46:19 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ బీసీ జేఏసీ ఈ నెల 18న తలపెట్టిన రాష్ర్టవ్యాప్త బంద్‌కు మద్దతు వెల్లువెత్తుతోంది. తెలంగాణ జన సమితి (టీజేఎస్), సీపీఎం బంద్ కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు చేస్తున్న పోరాటానికి అండగా నిలుస్తామని ఆయా పార్టీల నేతలు స్పష్టం చేశారు.
మంగళవారం బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, కో -చైర్మన్ రాజా రాం యాదవ్‌లతో కూడిన బృందం సీపీ ఎం రాష్ర్ట కార్యాలయంలో ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శి జాన్‌వెస్లీతో, టీజేఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాంతో వేర్వేరు గా భేటీ అయ్యింది. 18న జరిగే బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ వారికి వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా టీజే ఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మా ట్లాడుతూ.. రిజర్వేషన్లు బీసీల హక్కు, దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేవి కావు అని అన్నారు. కొన్ని పార్టీలు రిజర్వేషన్ల అంశంపై ద్వంద్వ వైఖరి అవలం బిస్తున్నా యని, ఓ వైపు కోర్టుల్లో కేసులు వేసిన వారికి మద్దతిస్తూనే, మరోవైపు బీసీలకు అన్యా యం జరిగిందని మొసలి కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. టీజేఎస్ 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లును ఆమోదింపజేసే వరకు మా పోరాటం కొనసా గుతుంది, అని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్‌రావు నేతృత్వంలో ఒక సబ్-కమిటీని ఏర్పాటు చేశామని, ఈ నెల 16న గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అం దజేస్తామని తెలిపారు.
బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల వాదనలు వినకుండా హైకోర్టు ఏకపక్షంగా స్టే ఇవ్వడం అన్యాయమని అన్నారు. ఈ స్టేపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. టీజేఎస్, సీపీఎం బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.