calender_icon.png 7 August, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు

06-08-2025 11:14:05 PM

- ధాన్యం అక్రమ విక్రయానికి పాల్పడిన చర్యలు తప్పవు

- జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య..

మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించిన రెండు రైస్ మిల్లుల యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య(District Additional Collector P. Chandraiah) బుధవారం తెలిపారు. హాజీపూర్ మండలం నర్సింగాపూర్ లోని శ్రీసాయి మణికంఠ ట్రేడర్స్ లో 2022-23, 2023-24 యాసంగి సీజన్ లకు సంబంధించి 4, 108 మెట్రిక్ టన్నుల ప్రభుత్వం ధాన్యం లేకపోవడంతో మిల్లు యజమానులైన గంప శ్రావణ్ కుమార్, కేతిరెడ్డి అనిల్ రెడ్డిలపై హాజీపూర్ పోలీస్ స్టేషన్ లలో వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందని, ఇట్టి ధాన్యం విలువ జరిమానాతో కలిసి రూ. 14.86  కోట్లు ఉందని తెలిపారు.

నర్సింగాపూర్ గ్రామంలోని శ్రీరాజ రాజేశ్వరి ట్రేడర్స్ మిల్లు 2022-23, 2023-24 వానాకాలం, 2024-25 కు సంబంధించి 8,578 మెట్రిక్ టన్నుల ప్రభుత్వం ధాన్యం లేకపోవడంతో మిల్లు యజమానులైన గంప సంతోష్ కుమార్, కేతిరెడ్డి మల్లారెడ్డి లపై హాజీపూర్ పోలీస్టే స్టేషన్ లో వివిధ సెక్షన్ల క్రింద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందని, ధాన్యం విలువ జరిమానాతో కలిసి 30.57 కోట్ల రూపాయలు ఉందని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ధాన్యంను పక్కదారి పట్టించిన 17 రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని, రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా అట్టి మిల్లుల నుంచి ప్రభుత్వ బాకీని వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు.