06-08-2025 11:11:58 PM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్...
సూర్యాపేట (విజయక్రాంతి): భూభారతి అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(District Collector Tejas Nandalal Pawar) అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి జిల్లాలోని ఆర్డీవో, తహసీల్దార్ లతో వెబ్ ఎక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన ఆర్జీలను త్వరగా పరిష్కరించాలని, వీలైనంత ఎక్కువ సిబ్బందిని వినియోగించుకొని ప్రతి గ్రామాన్ని సందర్శించి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిశీలించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరిష్కరించాలన్నారు.
ఒక గ్రామంలో పూర్తిగా దరఖాస్తుల పరిశీలన పూర్తయిన పిదప మరొక గ్రామానికి వెళ్లాలని ఆ విధంగా ఆర్డీవోలు అందరూ సంబంధిత తహసీల్దార్ లకు దిశా నిర్దేశం చేయాలన్నారు. అవసరం అయితే పైస్థాయి సిబ్బందిని కూడ వినియోగించుకొని ఉదయం, సాయంత్రం ఎక్కువ సమయం కేటాయించుకొని పెండింగ్ దరఖాస్తులను పూర్తి చేయాలన్నారు. అసైన్డ్ ల్యాండ్ లను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని, ప్రతిరోజు సంబంధిత తాసిల్దార్లు ఆరోజు జరిగిన దరఖాస్తుల వివరాలు సమర్పించాలన్నారు. అలాగే ఫుడ్ కమిషన్ చైర్మన్, మెంబర్లు జిల్లాను సందర్శించనున్న సందర్భంగా సంక్షేమ అధికారులు వారితో కలిసి సంక్షేమ హాస్టల్స్ ను, రెసిడెన్షియల్ హాస్టల్స్ ను సందర్శించి ఫుడ్ మెనూ వివరాలను వారికి వివరించాలన్నారు.
సాయంత్రం జరిగే ఫుడ్ కమిషన్ సమావేశానికి అన్ని సంక్షేమ హాస్టల్స్ వార్డెన్లను, ఎంఈఓ లను, ఐసిడిఎస్ సూపర్వైజర్ లను ఇట్టి సమావేశమునకు హాజరు అయ్యేటట్లు చూడాలన్నారు. ఈ సమావేశంలో డిఈఓ అశోక్, డిఆర్ డి ఓ వి. వి.అప్పారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మరియు స్త్రీ, శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ ఇన్చార్జ్ అధికారి దయానంద్ రాణి, ఎస్టీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.