01-08-2025 12:00:00 AM
- ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్ , జులై 31 : ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ పరిధిలోని ఫణిగిరి కా లనీ మూసీ నది ఒడ్డున ఉన్న శివాలయం వద్ద వారం రోజులుగా మొసలి సంచరించడాన్ని గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే చైతన్యపురి పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గురువారం ఫారెస్ట్ అధికారులు, హైడ్రా అధికారులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతాన్ని సందర్శించారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తున్న మొసళ్లను కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఫారెస్ట్ అధికారులకు సూచించారు. మొసళ్లను తరలించే వరకు శివాలయం పరిసరాల్లోకి వెళ్ళొద్దని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 3వ తేదీన బోనాల ఉత్సవాలు ఉన్నాయని, అప్ప టిలోగా మొసళ్లను పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫారెస్ట్ అధికారులు హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేశారు.
ఉప్పల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శరత్ చంద్రా రెడ్డి మాట్లాడుతూ... నీళ్ల లో ఉన్నప్పుడు ముసళ్లను పట్టుకోవడం సాధ్యం కాదని, ఒడ్డుకు చేరినప్పుడు వలతో బంధించి సురక్షిత ప్రాంతంలో వదిలేస్తామని తెలిపారు. మొసలి ఉన్న ప్రాంతాల్లో జన సంచారం లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, బీ ఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు తోట మహేష్ యాదవ్, నాయకులు సొంటి చంద్ర శేఖర్ రెడ్డి, అజయ, మోహన్ తదితరులుఉన్నారు.