11-07-2025 12:00:00 AM
-పత్తి, మొక్కజొన్నకు రూ.2 వేలు అదనం
-బ్యాంకర్లు ఆదరించేనా..
-రైతులకు ఆసరా లభించేనా..?
సంగారెడ్డి, జూలై 10(విజయక్రాంతి): ఈ ఏడాది పంటరుణ పరిమితిని ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రాష్ట్రస్థాయి టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్టీసీ) సిఫార్సుల మేరకు ఈ పెంపు ఉంటుంది. ప్రధానంగా రైతులకు ఏటా సాగులో పెట్టుబడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రుణ పరిమితి పెంపు ద్వారా అన్నదాతకు బ్యాంకులో లభించే రుణం కూడా పెరగనుంది.
జిల్లాలో ఈ ఏడాది 4 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా పత్తి 3.80 లక్షల ఎకరాల్లో సాగు కానున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత సోయా, కందులు, జొన్న తర్వాత వరి, మినుము, పెసర, ఇతర పంటలు స్వల్పంగా సాగు కానున్నట్లు పేర్కొంది.
పత్తి రైతుకు మేలు..
జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పత్తికి సంబంధించి పంటరుణ పరిమితి పెంచడం ద్వారా రైతులకు మేలు చేకూరనుంది. ఎకరానికి నిర్ధారిత మొత్తం బ్యాంకర్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వార సాగులో వారికి పెట్టుబడి భారం ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం పత్తికి ప్రస్తుత రుణ పరిమితి ఎకరానికి రూ.44,000 - 46,000 ఉండగా, పెంచిన రుణ పరిమితి ఎకరానికి రూ.46,000 - 48,000 వరకు పెరిగింది.
బ్యాంకులు ఆదరించేనా..
ఈ ఏడాది లక్షలాది రైతుల అకౌంట్లకు రుణాలు అందజేయాలని బ్యాంకర్లు లక్ష్యం పెట్టుకున్నారు. అలాగే అన్నదాతలకు విరివిగా రుణాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతుల ఆర్థిక పరిస్థితులతో రుణం కట్టలేని పరిస్థితిలో ఉండగా, బ్యాంకర్లు దాన్ని మరో విధంగా తమకు ఉపయుక్తంగా మార్చుకుంటున్నారు.
పాత రుణాన్ని రెన్యూవల్ చేస్తున్నట్లే చేసే బ్యాంకర్లు రుణపరిమితి ఆధారంగా పెంచిన మొత్తాన్ని రైతుల చేతికి ఇచ్చి మిగతా మొత్తం పాత బకాయిగా సర్దుబాటు చేసుకోవడం ద్వారా తమ లక్ష్యం పూర్తయిందన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉంది. సాధారణంగా ఏటా బ్యాంకులో రైతుల పరంగా జరిగే ఈ తంతు సాధారణమే. ఈ పరిస్థితుల్లోనే రైతులు తిరిగి బయట అప్పు చేస్తుండడం ఆనవాయితీగా మారింది.