24-01-2026 01:05:28 AM
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): కేంద్రప్రభుత్వం మేడారం జాతరకు రూ.3.70 కోట్లు విడుదల చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నిధులను తన ప్రత్యేక చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ, గిరిజన మంత్రిత్వశాఖలు విడుదల చేశాయని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామర వాయి, మల్లూరు, బోగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించనుంది.
ఇందు కోసం ‘గిరిజన సర్క్యూట్’ పేరుతో గతంలో రూ.80 కోట్లతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా పలు అభివృద్ధి పనులను కూడా చేపట్టిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా, యూనెస్కో గుర్తింపు లభించిన రామప్ప దేవాలయ అభివృద్ధికి కూడా రూ.140 కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన పే ర్కొన్నారు. అమ్మవార్లకు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకోవడానికి రాష్ట్ర నలుమూలలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర జరిగే నాలుగు రోజుల పాటు దక్షిణ మధ్య రైల్వే శాఖ 30 ప్రత్యేక రైళ్లను నడుపుతుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.