24-01-2026 01:10:53 AM
తుట్టెలు కట్టి.. పురుగులు పట్టి..
ముక్కి పోతున్న 1.15 లక్షల మెట్రిక్ టన్నులు
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి) : అధికారుల పట్టింపు లేని కారణంగా రూ. కోట్ల సొత్తు పనికిరాకుండా పోతోంది. సకాలంలో స్పందించి సద్వినియోగపర్చాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో నెలల తరబడి గోదాముల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం ఎలుకలు, పురుగుల పాలవుతోంది. లక్షకుపైగా మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం తుట్టెలు కట్టి.. పురుగులు పడుతున్నా అధికారుల్లో చలనం కరువైందనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.
గత ఏడాది ఉగాది నుంచి..
తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఉగాది నుంచి రేషన్‌షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నది. కుటుంబలోని ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సివిల్ సప్లయీస్ ద్వారా సరఫరా చేస్తోంది. అయితే, అప్పటికే ఉన్న దొడ్డు బియ్యంపై ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడంతో అనేక గోదాముల్లో ఉన్న నిల్వలు ముక్కిపోతున్నాయి.
అంతే కాకుండా అంతకు ముందే రేషన్ డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యం కూడా వెనక్కి తీసుకోలేదు. దీంతో అటు గోదాములు, ఇటు డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డు బియ్యానికి పురుగులు పట్టి.. పిండిగా మారుతున్న పరిస్థితి నెలకొన్నది. మరోవైపు సన్న బియ్యం నిల్వ చేయడానికి స్థలం కొరత ఏర్పడుతున్నది.
1.15 మెట్రిక్ టన్నుల నిల్వలు
రాష్ట్ర వ్యాప్తంగా 17,200పైగా రేషన్ షాపులున్నాయి. సన్న బియ్యం పథకం ప్రారంభించి 9 నెలలు కావొస్తున్నా..తమ వద్ద ఉన్న దొడ్డు బియ్యం మాత్రం అధికారులు వెనక్కి తీసుకోవడం లేదని రేషన్ డీలర్లు వాపోతున్నారు. రాష్ర్టంలోని పలు జిల్లాల్లోని గోదాములు, రేషన్ డీలర్ల వద్ద కలిపి 1.15 లక్షల మెట్రిట్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. వీటిలో గోదాముల్లో 90వేల మెట్రిక్ టన్నులు, రేషన్ దుకాణాల్లో 25 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం స్టాక్ ఉన్నట్లు తెలుస్తున్నది.
వీటిని కిలో రూ.40 చొప్పున టెండర్లద్వారా విక్రయిస్తే సర్కారుకు భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంకొంత కాలం పట్టించుకోకుంటే.. ముక్కిపోయి సముద్రంలో పారబోసే పరిస్థితి వస్తుందని డీలర్లు చెబుతున్నారు. పాత స్టాక్‌తో సన్న బియ్యం నిల్వ చేసేందుకు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని వాటిని అక్కడి నుంచి తరలిస్తే కొంత నగదు వస్తుందంటున్నారు.
వేలం వేస్తే 450 కోట్ల ఆదాయం
గోదాములు, రేషన్ డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డు బియ్యం బహిరంగ వేలం వేస్తే ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.450 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోపక్క డీలర్లు కూడా తమ వద్ద దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయని, వాటిని వాపసు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరుతున్నారు. అయితే, ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడంతో గత కొన్ని నెలలుగా దొడ్డు బియ్యం నిల్వలు రేషన్ షాపుల్లో, గోదాముల్లో ముక్కిపోతూ.. ఎలుకలకు ఆహారంగా మారుతున్నాయి.
ఈ దొడ్డు బియ్యాన్ని బెవరేజెస్ కంపెనీలు, కోళ్ల ఫారాలకు విక్రయించాలని ఐదు నెలల క్రితమే ప్లాన్ చేశారు. అంతే కాకుండా కర్ణాటకలో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండడంతో.. అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి సమాచారం పంపారు. వేలంలో ఎక్కువ ధరకు కోట్ చేసిన వారికి ఇవ్వాలని భావించారు. అయినప్పటికీ దొడ్డు బియ్యం విక్రయం ముందుకు సాగడం లేదని చెబుతున్నారు.