calender_icon.png 24 January, 2026 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిగడ్డకు పరీక్షలు

24-01-2026 01:16:48 AM

కాళేశ్వరం పునరుద్ధరణ దిశగా కీలక అడుగు

  1. షబ్బీర్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం
  2. శుక్రవారం నుంచి బ్లాక్-1లో కొనసాగుతున్న ఎన్‌ఐటీ పరీక్షలు

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కీలక పరిణామం చోటుచేసుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తును నిర్ణయించే దశలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ వద్ద చోటుచేసుకున్న నష్టాలు, భద్రతా ప్రమాణాల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ సీడబ్ల్యుపీఆర్‌ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) శాస్త్రవేత్తల బృందం శుక్రవారం క్షేత్రస్థాయిలో విస్తృత పరీక్షలను చేపట్టింది.

ఈ పరీక్షల ఫలితాలు కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ దిశ, భవిష్యత్తు కార్యాచరణను పూర్తిగా ప్రభావితం చేయనున్నాయి. మేడిగడ్డ బరాజ్‌లో గతంలో జరిగిన నిర్మాణ లోపాలు, కాంక్రీట్ క్షీణత, ఫౌండేషన్ స్థిరత్వంపై అనుమానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థల సహకారాన్ని కోరింది. దానికి స్పందనగా సీడబ్ల్యుపీఆర్‌ఎస్ రంగంలోకి దిగింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా డ్యాములు, బరాజ్‌లు, హైడ్రాలిక్ నిర్మాణాల భద్రతపై నిపుణత్వం కలిగి ఉండటంతో, మేడిగడ్డపై జరుగుతున్న అధ్యయనం అత్యంత ప్రామాణికంగా భావిస్తున్నారు.

కాళేశ్వరం భవిష్యత్తుకు కీలకంగా..

సీడబ్ల్యుపీఆర్‌ఎస్ రూపొందించనున్న తుది నివేదిక కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండనుంది. ఈ నివేదికలో మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలు, మరమ్మతులు సరిపో తాయా? లేక పునర్నిర్మాణం అవసరమా?, దీర్ఘకాలిక భద్రతకు తీసుకోవాల్సిన సాంకేతిక చర్యలు, నీటి నిల్వలు, ఆపరేషన్ విధానాల్లో మార్పులపై సూచనలు వంటి అంశాలపై స్పష్టమైన సిఫార్సులు ఉండనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీరు, తాగునీరు, పరిశ్రమల అవసరాలకు కీలకమైనదిగా ఉండటంతో ఈ నివేదికపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే మేడిగడ్డ భవిష్యత్తును, అలాగే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు దిశను నిర్ణయించనున్నాయి. మొత్తంగా మేడిగడ్డ బరాజ్‌లో సీడబ్ల్యుపీఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్న సమగ్ర పరీక్షలు కాళేశ్వరం పునరుద్ధరణ దిశగా కీలక మలుపుగా మారుతున్నాయి. ఈ శాస్త్రీయ అధ్యయనం పూర్తయ్యాక తీసుకునే నిర్ణయాలపై లక్షలాది రైతులు, కోట్లాది ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉండటం గమనార్హం. 

షబ్బీర్ నేతృత్వంలో నిపుణుల బృందం..

సీడబ్ల్యుపీఆర్‌ఎస్ సీనియర్ శాస్త్రవేత్త షబ్బీర్ నేతృత్వంలో అనుభవజ్ఞులైన సివిల్, హైడ్రాలిక్, జియోటెక్నికల్ ఇంజినీర్లు, స్ట్రక్చరల్ సేఫ్టీ నిపుణులతో కూడిన బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తోంది. బ్యారేజీ డిజైన్ ప్రమాణాలు, నిర్మాణ సమయంలో పాటించిన నిబంధనలు, నీటి ఒత్తిడి వల్ల ఏర్పడిన ప్రభావాలు, వరద ప్రవాహం సమయంలో నిర్మాణంపై పడిన భారం, వంటి అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నారు.

మేడిగడ్డ బ్యారేజీలో అత్యంత సున్నితంగా గుర్తించిన బ్లాక్-1 వద్ద ప్రస్తుతం ఎన్‌ఐటీ (నాన్ డిస్ట్రక్టివ్ ఇన్వెస్టిగేషన్ టెస్ట్) కొనసాగుతున్నాయి. ఈ పరీక్షల్లో అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ టెస్ట్, రీబార్ డిటెక్షన్, కాంక్రీట్ స్ట్రెంగ్త్ అంచనా, అంతర్గత చీలికల గుర్తింపు వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులు వినియోగిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా నిర్మాణాన్ని దెబ్బతీయకుండా లోపలి పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

అవసరమైతే ఇతర బ్లాక్‌లకు కూడా ఈ పరీక్షలను విస్తరించే యోచనలో అధికారులు ఉన్నారు. బరాజ్ కింద ఉన్న ఫౌండేషన్, నేల స్థితిగతులపై కూడా సీడబ్ల్యుపీఆర్‌ఎస్ బృందం ప్రత్యేక దృష్టి సారించింది. మట్టి బలం, సీపేజ్ సమస్యలు, అండర్-సీప్ ప్రభావం వంటి అంశాలు గతంలో తలెత్తిన నష్టాలకు కారణమా? అన్న కోణంలో లోతైన విశ్లేషణ జరుగుతోంది. ఈ అంశాలే భవిష్యత్తులో బ్యారేజీ భద్రతకు కీలకంగా మారనున్నాయి.