24-01-2026 01:24:20 AM
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి) : ఫోన్ ట్యాపింగ్‌పై గత రెండే ళ్లుగా ఈ విచారణ కొనసాగిస్తున్నారని, లీకుల మీద లీకులిస్తూ, ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే వ్యవహారానికి బాధ్యులు ఎవరని సిట్ అధి కారులను అడిగినట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ‘మాకు సంబంధం లేదండి, మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం‘ అని వారు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రతి సారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడం, లేదా విచారణకు పిలవకపోయినా ఏదో జరిగింది అంటూ లీక్ ఇవ్వడం, తెల్లారి హెడ్‌లైన్ కావడం, దానివల్ల ప్రజలు నిజమనుకొని భ్రమించే పరిస్థితులు వచ్చాయని, ఇది మంచిది కాదు అని చెప్పినట్టు వివరించారు. సిట్ విచారణకు హాజరై తెలంగాణ భవన్‌కు తిరిగివచ్చిన తర్వాత కేటీఆర్ మీడియా తో మాట్లాడారు.
కొన్ని పేపర్లు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో మరి ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారని, కొంతమంది హీరోయిన్లను వీళ్లు ఏదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టమొచ్చినట్టుగా అడ్డగోలు వ్యాఖ్యలు రాశారని.. ఇది వాస్తవమా? వాస్తవమైతే మా ముందు పెట్టాలని ప్రశ్నించినట్టు చెప్పారు. ‘మీరు ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తున్నారు కదా.. దయచేసి మీరు చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో మా ప్రతిపక్ష పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలు, మా నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదని చెప్పండి అని అడిగినా. వాళ్ళు.. మాకేం సంబంధం, మాకు తెలవదు.. అని నీళ్లు నమలడం తప్ప, కావడం లేదని చెప్పే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరో ఒకరిని నా పక్కన కూర్చోబెట్టి విచారించారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అక్కడ కల్వకుంట్ల తారక రామారావు తప్ప ఏ రావు ఎవరూ లేరు. నేను ఒక్కడినే ఉన్నాను. పోలీసులు తప్ప మరెవరూ లేరు. ఈ రోజు మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్నది నిజం’ అని తేలిపోయిందన్నారు. సింగరేణి టెండర్లలో దొంగలు దొరికారని, దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు.
కాలక్షేప కథాచిత్రాలు..
గత రెండేళ్లుగా తమ అసమర్థ పాలనను, పరిపాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి కాలక్షేప కథాచిత్రాలు నడుపుతున్నారని, అందులో భాగంగా నాకు నోటీసులు ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేశారని కేటీఆర్ విమర్శించారు. ఆ విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు ఏడు, ఏడున్నర గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పానని, విచారణ సందర్భంగా నేను కొన్ని ప్రశ్నలు అడిగినట్టు పేర్కొన్నారు.
అక్కడ ఉన్న అధికారి ‘లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకు చెప్పాం కదా‘ అన్నారని తెలిపారు. మీరు ఇన్ని రోజులు లీకుల పేరుతో నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులను మీరు నిరోధించలేరా అని అడిగినట్టు వెల్లడించారు. ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వమని, వీళ్లు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వమని, ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించవద్దని, దానిలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మొన్న హరీష్ రావు విచారణ సందర్భంగా కూడా అనేక అడ్డగోలు లీకులిచ్చారని, ఇప్పుడు కూడా ఫలానా ఆయనను తీసుకొచ్చారు, ఇట్లా చేశారు, ఉక్కిరి బిక్కిరి, ఇన్ని ప్రశ్నలు. అన్ని ప్రశ్నలు అని లీకులు ఇస్తారని విమర్శించారు. మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మాకు అభిమానులు ఉన్నారు, మాకు కార్యకర్తలు ఉన్నారు, మా నియోజకవర్గాల్లో మాపై ఆశలు పెట్టుకున్న ప్రజలు ఉన్నారు. వాళ్ళు బాధపడతారని, ఇష్టమొచ్చినట్టుగా అల్లి వార్తలు రాయవద్దన్నారు.
ఎన్ని సిట్లు వేసినా సహకరిస్తాం..
ఒక మంత్రి స్వయంగా ‘నా ఫోన్ ట్యాప్ అయి ఉంది, నేను మీతో మాట్లాడలేను’ అని జర్నలిస్టులకు చెప్పుకునే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా మీరు చెప్పండి అని అడిగానని, దానికి కూడా సమాధానం చెప్పకుండా అది కాదు ఇది కాదు అని తప్పించుకునే ప్రయత్నం తప్ప వారు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదని తెలిపారు. అడిగిన ప్రశ్నలే అడుగుతూ మళ్ళీ మళ్ళీ అడుగుతూ.. ఒక 300 పేర్లు చదువుతూ ఈయన తెలుసా, ఈయన తెలుసా, ఫలానా ఆయన తెలుసా అని దానితోనే ఎనిమిది గంటలు టైంపాస్ చేయడం తప్ప అక్కడ విషయం ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
మేము ఒక పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని, మీరు ఎన్ని కేసులన్నా పెట్టండి, ఎన్ని సిట్లన్నా వేయండి... బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సహకరిస్తామని, మీరు ఎన్ని సార్లు పిలిచినా వస్తామని చెప్పారు.
సింగరేణి కుంభకోణంపై ఉలుకుపలుకు లేదు..
సింగరేణి టెండర్లలో దొంగలు దొరికారని, సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య వాటాల పంచాయతీలో దొంగలు దొరికినారు అని చెప్పి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా ఇస్తానని చెప్తే కూడా ఇప్పటివరకు ఉలుకు లేదు పలుకు లేదన్నారు. ముఖ్యమంత్రి అనుచరుడు, అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అట్లాగే మంత్రి గారి ఓఎస్డీ మధ్య జరిగిన పంచాయతీ... రూ. 300 కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టినారు అని చెప్పి కేసు నమోదైతే దాని మీద సిట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు భూ కబ్జాలు చేస్తూ గుండాలను తీసుకొని స్వైర విహారం చేస్తుంటే దానిపైన సిట్ వేయాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఐఎల్టీపీ అని చెప్పి పారిశ్రామిక భూములను కొల్లగొట్టి 5 లక్షల కోట్ల హైదరాబాద్ ప్రజల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే దాని మీద ఎస్‌ఐటి ఎందుకు ఉండదన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్‌లో ముఖ్యమంత్రి బావమరిది కింగ్ పిన్‌గా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకంలో కూడా మరి అర్హతలు లేకపోయినా టెండర్లు కట్టబెడుతున్నారని ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదన్నారు. ఒక ఏఐసీసీ సెక్రెటరీ రూ.8 కోట్ల అడుగుతున్నాడు, లేకపోతే పని చేయనిస్తలేడు అని బెదిరించారని కాంట్రాక్టర్ సంస్థ ఫిర్యాదు చేస్తే చర్య ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ప్రజల దృష్టి మరల్చేందుకే..
ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చెప్తాం, బాధ్యతగల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతిలో ముందుకు పోతామని కేటీఆర్ అన్నారు. వాళ్ళ దగ్గర కేస్ కూడా ఏం లేదని, ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం, తిప్పి తిప్పి అడగడం.. తప్ప ఏమీ కూడా లేదన్నారు. గత రెండేళ్లుగా, ఈ ప్రభుత్వ అసమర్థతను, వైఫల్యాలను, వారి అవినీతిని బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రతిరోజూ ఎండగడుతోందన్నారు.
నన్ను సాక్షిగా పిలిచారా లేక మరేదైనా కారణంతోనా అన్నది నాకు తెలియదు కానీ, వాళ్ళు అడిగిందే అడిగారని, ఏదో ఒక కథను సృష్టించి, ప్రజలను భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టిని వారి వైఫల్యాల నుంచి మరల్చడానికి పోలీసు వ్యవస్థను రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము భయపడే వాళ్లమైతే సమయం అడుగుతుంటిమి, కోర్టుకు వెళ్తుంటిమని చెప్పారు.
ఎలక్టోరల్ బాండ్లపై సిట్ ప్రశ్నలు
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 23 (విజయక్రాంతి): రాష్ట్ర రాజ కీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపి ంగ్ కేసు విచారణ కీలక మలుపు తిరి గింది. ఇన్నాళ్లూ కేవలం ప్రతిపక్ష నేతల సమాచారం తెలుసుకోవడానికే ట్యాపింగ్ జరిగిందన్న వాదన నుంచి.. రాజకీయ విరాళాలు, బలవంతపు వసూళ్ల కోణంలోకి దర్యాప్తు మళ్లింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ శుక్రవారం దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించింది.
ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ ఖాతాలోకి వచ్చి న ఎలక్టోరల్ బాండ్లు, వాటి వెనుక ఉన్న వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ అంశాలనే అస్త్రాలుగా చేసుకుని జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో.. సిట్ విచారణ సాగినట్లు సమాచారం. వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి, వారి వ్యక్తిగత, వ్యాపార బలహీనతలను తెలుసుకుని.. వాటిని అడ్డుపెట్టుకుని పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు ఇప్పించుకున్నారా.. అని ప్రశ్నించినట్లు స మాచారం.
సంధ్య శ్రీధర్‌రావు నుంచి వచ్చి న రూ.12 కోట్ల బాండ్ల వ్యవహారంపై లోతు గా ఆరా తీశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఆర్థిక వ్యవహారాలపై మీకున్న పవర్ ఏంటి.. నిధుల సమీకరణలో పోలీసు అధికారులను వాడుకున్నారా.. అన్న ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాల్సి వచ్చిందని తెలిసింది. ట్యాపింగ్ కోసం అత్యధునిక ఇజ్రాయెల్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయడానికి పార్టీ నిధులు వాడారా అన్న కోణంలో నూ ప్రశ్నలు వచ్చాయి.
సిరిసిల్లలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు అంశాన్ని ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రశ్నించారు. ఓ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్‌రావు తో ఉన్న సంబంధాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ ప్రముఖులు, రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులపై నిఘా పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశ్యాలను అడిగినట్లు సమాచారం.
జూబ్లీహిల్స్ వద్ద హైటెన్షన్..
విచారణ జరుగుతుండగానే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ నేతను అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ శ్రేణు లు, మహిళా నేతలు స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.