calender_icon.png 24 January, 2026 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టిన మట్టి సాక్షిగా.. ఏ తప్పూ చేయలేదు

24-01-2026 12:59:19 AM

ఏడెనిమిదేళ్లుగా నా వ్యక్తిత్వ హననం

  1. డ్రగ్స్ కేసుల్లో, హీరోయిన్లతో సంబంధాలున్నాయని ఇరికించే యత్నం 
  2. నా పరువుకు భంగం కలిగించిన సీఎం, ఆయన తొత్తులను వదిలిపెట్టను
  3. అటెన్షన్ డైవర్షన్ కోసమే సిట్ విచారణ
  4. పది సార్లునా విచారణకు హాజరవుతా
  5. రెండేళ్లుగా పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం
  6. మంత్రులతోపాటు మా ఫోన్లనూ సీఎం ట్యాప్ చేయిస్తుండు
  7. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తూనే ఉంటాం
  8. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి) : ‘ఈ మట్టి సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా చెబుతున్నా.. నేను ఏనాడూ అక్రమాలకు పాల్పడలేదు.. అనైతిక పనులు  చేయ లేదు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గత ఏడెనిమిది ఏళ్లుగా నా మీద తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్(వ్యక్తిత్వహననం) జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో డ్రగ్స్ కేసుల్లో నో, హీరోయిన్లతో సంబంధాల్లో ఇరికించాలని, దిక్కుమాలిన వార్తలు రాయించి నన్నే కాకుండా నా కుటుంబాన్ని, పిల్లలను కూడా మానసిక క్షోభకు గురిచేశారని వాపోయారు. 

 అయినా, నేను ఎవరికీ భయపడలేదన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నన్ను విచారణకు పిలిచారని, మా ప్రభుత్వం ఏం తప్పు చేసిందో, అసలు ఎక్కడ తప్పు జరిగిందో వాళ్లు సమాధానం చెప్పాలన్నారు. రెండేళ్లుగా ఒక సీరియల్ లాగా లీకులు ఇస్తూ మా మీద వ్యక్తిత్వ హననం చేస్తున్న దానికి బాధ్యులెవరో నిలదీస్తానని చెప్పారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని అటు కాంగ్రెస్ పార్టీ వాళ్లు, ఇటు పోలీసులు రెండు నెలలు డ్రామా నడిపించి, మూడో నెలలో ఏ హీరోయిన్ ఫోన్ ట్యాప్ కాలేదు, అంతా బోగస్, తూచ్ అని మీరే రాయిస్తారని విమర్శించారు.

మరి నా పరువుకు, నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు?, రేవంత్ రెడ్డి బాధ్యుడా?, ఈ లీకులు ఇచ్చిన పోలీసోళ్లు బాధ్యులా? రాసిన మీడియా వాళ్లు బాధ్యులా? అని కేటీఆర్ ప్రశ్నించారు. శుక్రవారం సిట్ విచారణకు వెళ్లే ముందు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ంలో అనేక కుంభకోణాలు బయటపడుతున్న నేపథ్యంలో ప్రజల అటెన్షన్ డైవర్షన్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ చేపడుతుందని కేటీఆర్ ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో పదిసార్లు పలిచినా సిట్ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. పదిహేనేళ్లుగా నేను నా రాష్ట్రం కోసం పని చేశానని,మేము ఎప్పుడూ టైం పాస్ రాజకీయాలు చేయలేదని వెల్లడించారు. ప్రత్యర్థుల కుటుంబాలను, పిల్లలను రాజకీయాల్లోకి లాగలేదని, ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి వేధించలేదని గుర్తుచేశారు. మా నాయకుడు కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పని హామీలను కూడా నెరవేర్చారని, రైతుబంధు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు మేము ప్రజల కోసం చేశామని పేర్కొన్నారు.

రెండేళ్లుగా ఈ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. అసమర్థుని జీవయాత్ర లాగా ఏదో రకంగా కాలక్షేపం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రోజుకో కొత్త డ్రామా ఆడుతు న్నారని, అందులో భాగంగానే ఈ కాళేశ్వరం, గొర్రెల స్కామ్ , ఫార్ములా ఫోన్ ట్యాపింగ్ వంటి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. 

నాటి నుంచే ఫోన్ ట్యాపింగ్

ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ జరగడం లేదని ఏ పోలీస్ అధికారి అయినా ముందుకొచ్చి చెప్తారా, కెమెరా ముందుకు వచ్చి చెప్పే ఒక్క పోలీసోడు ఉన్నాడా, డీజీపీ శివధర్ రెడ్డి ముందుకు వస్తారా, ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకు వస్తారా, కమిషనర్ సజ్జనార్ ముందుకు వస్తారా అని సవాల్ విసిరారు. నాటి మాజీ ప్రధాని నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు గూడఛారి వ్యవస్థలు పనిచేస్తూనే ఉంటాయని, ఎవరైనా ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేసినా, దేశంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే విధంగా వ్యవహారం చేసినా వాటిని నిరోధించేందుకు పోలీసు వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ వెళుతుందని స్పష్టం చేశారు.

‘2015లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో మా ఎమ్మెల్యేను ఒకరిని కొనడానికి ఒక దొంగ రూ.50లక్షల రూపాయల బ్యాగుతో వచ్చి దొరికిండు. ఆ తర్వాత ఆ దొంగ మీద ఏమన్నా నిఘా పెట్టిండ్రేమో పోలీసులు మాకేం తెలుసు? మాకేం సంబ ంధం?, పోలీసులు, దొంగలు- వాళ్లకు వాళ్లకు సంబంధం ఉంటది మాకేం సంబంధం? మధ్యలో రాజకీయ నాయకత్వానికి.

ఇవాళ వాస్తవం ఏంది?.. 2015లో ఏ దొంగనైతే దొరికిండో రూ.50 లక్షలతో -అడ్డంగా రాష్ట్రం మొత్తం చూస్తుండగా -ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నారని’ ఎద్దేవా చేశా రు. ఆ దొంగకు మిగతా వాళ్లు కూడా నా లెక్కనే రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తారు.. వాళ్లకు బుర ద అంటించాలి, వాళ్లను బద్నామ్ చేయాలని, అందుకే విచారణకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. 

రేవంత్‌రెడ్డి జేజమ్మకూ భయపడేది లేదు 

ఒక మూడు రోజుల కింద హరీశ్‌రావు ఒక ప్రెస్ మీట్ పెట్టి సింగరేణి కాలరీస్ ఏదైతే ఉన్నదో అక్కడ వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని, దానిలో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి అని ఆరోపించారు. ఈ మొత్తం స్కామ్ చేసింది రేవంత్ రెడ్డి బావమరిదే అని, సింగరేణితో సీఎం ఎలా ఫుట్‌బాల్ ఆడుతున్నారో, సింగరేణి సంస్థను సీఎం తన కామధేనువుగా ఎలా మార్చుకున్నారో హరీశ్‌రావు ఆధారాలతో సహా చూపించారని చెప్పారు.

దీనిపై రాష్ట్రంలోని మంత్రిగానీ, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి గానీ స్పందిస్తాడేమో, ఈ దొంగలను పట్టుకుంటాడేమో అనుకున్నామని, కానీ అదే రోజు సాయంత్రానికల్లా హరీశ్‌రావుకు సిట్ నోటీసు పంపించారని విమర్శించారు. విచారణలో భాగంగా హరీశ్‌రావు సిట్ అధికారులనే ఉల్టా ప్రశ్నలు అడిగితే నీళ్లు నమిలారని ఎద్దేవా చేశారు. కార్తీకదీపం, మనసు-మమత వంటి డైలీ సీరియల్ మాదిరిగా నాకు నోటీసులు పంపించారని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి, ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నారని, దొంగ పని చేసి దొరికిపోవడం రేవంత్‌రెడ్డి ప్రత్యేకత అని, సింగరేణిలో, మూసీ, హైడ్రాలో, హిల్ట్ కుంభకోణంలో, లగచర్లలో దొరికిపోయారని ఎద్దేవా చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇవాళ ఒక్క దొంగ లేడు ఈ రాష్ట్రంలో, దండుపాళ్యం ముఠా లెక్క.. క్యాబినెట్‌లో ఉన్నా వారందరూ అందినకాడికి దోచుకొనే స్కీమ్‌లో భాగంగా దోచుకుంటున్నారని విమర్శించారు.

ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే వాళ్లకు ఎక్కడలేనీ మంటగా ఉందన్నారు. తప్పు చేసినవాడు భయపడతాడు, తప్పు చేయనోళ్లు ఎవరికీ భయపడరని, రేవంత్ రెడ్డి కాదు.. ఆయన జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదని స్పష్టం చేశారు. 

రేవంత్‌ను, ఆయన తొత్తులను వదిలిపెట్టను... 

‘ముమ్మాటికీ ఒక్కటి మాత్రం పక్కా. ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టం. నా క్యారెక్టర్ అస్సాసినేషన్‌కు బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న  కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఆయన అడుగులకు మడుగులొత్తుతూ పనిచేస్తున్నారో వాళ్లని నేను కూడా వదిలిపెట్టను’ అని హెచ్చరించారు. లేని లింకులు, లేని రంకులు అంటగట్టి, హీరోయిన్లతో లేని సంబంధాలు అంటగట్టే వారిని వదిలిపెట్టను స్పష్టం చేశారు.

మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని, చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తామని, మేము తప్పు చేయలేదు, చేయలేదన్న మాటనే చెప్తామన్నారు. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్ లాడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదే ఉందో, అట్లే మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత, మీ అవినీతి, ప్రజలకి ఇచ్చిన ఎగ్గొడుతున్న హామీల మీద ఉంటదని స్పష్టం చేశారు.

ఎనుముల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్‌రెడ్డిగా ఎట్లా మారిపోయాడో అన్న దానిపై.. 420 హామీలు ఇచ్చి ఇప్పటివరకు నాలుగు హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటికి ఎండగడుతూనే ఉంటామని, 100 శాతం వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎవరికీ భయపడకుండా, ఎవరికీ తలవంచకుండా నిఖార్సయిన తెలంగాణ బిడ్డలుగా, కేసీఆర్  సైనికులుగా, కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూనే ఉంటామని తెలిపారు.