calender_icon.png 24 January, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోలార్ స్కాం!

24-01-2026 01:36:22 AM

వదల బొమ్మాళీ.. సింగరేణి బొగ్గు స్కాం పార్ట్

రామగుండంలో 540 కోట్ల టెండర్

అయినవారికే కట్టబెట్టారు..

సింగరేణి నెత్తిన 200 కోట్లు అదనం!

సింగరేణి సిరుల గని.. అది ఇప్పుడు సృజన్ గని!

107 మెగావాట్ల మూడు సోలార్ ప్లాంట్లకు సింగిల్ టెండర్

ఎంఎస్‌ఎంఈలకు కాదని.. గోల్టీ సోలార్ పవర్ కన్సార్షియంకు అప్పగింత

రూ. 3 కోట్లు అయ్యేదానికి రూ. 5.4 కోట్లు చెల్లింపు 

సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనల్లో మార్పు

సీఎం రేవంత్ బావమరిది సృజన్‌రెడ్డి కోసమే సింగరేణిలో కుంభకోణాలు 

వివరాలు వెల్లడించిన మాజీమంత్రి హరీశ్‌రావు

సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విచారణ జరిపించాలి

* శ్రీరాంపూర్ ఓబీ టెండర్ ఏడుసార్లు ఎందుకు వాయిదా పడ్డదో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విచారణ జరపాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినంక మొత్తం సైట్ విజిట్ సర్టిఫికెట్‌తో 6 ఓబీ కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచారు. ఈ ఆరు ఓబీ కాంట్రాక్టర్లను వెంటనే రద్దు చేయాలి. 

 మాజీమంత్రి హరీశ్‌రావు

ఎక్స్‌ప్లోజింగ్ స్కాం

సింగరేణిలో ఎక్స్ ప్లోజింగ్ కోసం జిలెటిన్ స్టిక్స్ వాడతారని, ఆ జిలెటిన్ స్టిక్స్ కొనుగోలులో 30 శాతం రేటు అదనంగా పెట్టి కొనాలని ఒత్తిడి తెచ్చారని హరీశ్‌రావు తెలిపారు. ఇందుకు జీవీ రెడ్డి అనే ఒక డైరెక్టర్ నిరాకరిస్తే.. ఒత్తిడి తీసుకురావడం తో ఆయన చివరికి రాజీనామా చేసి వెళ్లిపోయారని పేర్కొన్నారు. తర్వాత ఇంకో డైరెక్టర్ వీకే శ్రీనివాస్ కూడా సంతకం పెట్టేందుకు నిరాకరిస్తే.. ఆయన్ను డైరెక్టర్ నుంచి జీఎం పదవికి రివర్స్ చేశారని తెలిపారు. ఇలా బెదిరించి, భయపెట్టి నిబంధనలు మార్చి కోట్లాది రూపాయల స్కాంకు తెరదీస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి) : సింగరేణి లో బొగ్గు కుంభకోణంతోపాటు సోలార్ పవర్ స్కాం జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌లో పెద్ద కుంభకోణం జరిగిందని, మూడు వేరువేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ల కోసం.. తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి ఎంఎస్‌ఎంఈలు పాల్గొనకుండా ఉండేందుకు మూడు సైట్లు కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారని మండిపడ్డారు.

ఇందులో ఎం ఎస్‌ఎంఈలు పాల్గొనకుండా, పారిశ్రామికవేత్తలు పాల్గొనకుండా సోలార్ పవర్ ప్లాంట్లను ఎత్తుకపోవడానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కండిషన్‌ను పెట్టారని, వారు అనుకున్న కన్సార్షియం కంపెనీలకు 250 కోట్ల రూపాయలు అదనంగా వచ్చేవిధంగా ఈ టెండర్లను కట్టబెట్టారని తెలిపారు. ఈ టెండర్‌ను గోల్టీ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కన్సార్షియం కంపెనీకి అప్పచెప్పారని చెప్పారు. దే

శవ్యాప్తంగా సోలార్ పవర్‌పై టెండర్లు కొనసాగుతున్నాయని, ఒక మెగావాట్ సోలార్ ఉత్పత్తి చేయడానికి బయటి రాష్ట్రాల్లో మూడున్నర కోట్లు అవుతుందని, పైగా భూమి కూడా సోలార్ కంపెనీలదే ఉంటుందన్నారు. అయితే సింగరేణి భూమి కేటాయించి, సోలార్ ప్లాంట్లు పెట్టి సోలార్ పవర్ ఉత్పత్తి చేసినందుకు ఒక మెగావాటుకు రూ. 5.4 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్‌కు చెల్లించబోతున్నదని చెప్పారు.

రూ. 540 కోట్ల ఈ టెండర్‌ను వారికి కావాల్సినవారికి కట్టబెట్టారని, సింగరేణి దాదాపు రూ. 200 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సోలార్ పవర్ స్కాం రామ గుండంలో జరిగిందని శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. 

కావాల్సిన వారికే..

67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ విషయంలో దాదాపు ఏడు కోట్లకు ఒక మెగావాటు సోలార్ పవర్ ఉత్పత్తికి ఈ ప్లాంట్‌ను కట్టబెట్టారని, ఇది నేషనల్ ఆవరేజ్ కంటే డబుల్ కాస్ట్ అని తెలిపారు. రూ. 480 కోట్ల కు వారికి కావలసిన కంపెనీకి కట్టబెట్టారని, ఈ కంపెనీకి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనలు మార్చడం తమ అనుయాయులకు కట్టబెట్టడం కోసమేనన్నారు. అక్కడో రూ. 250 కోట్లు, ఇక్కడ రూ. 250 కోట్లు నేరుగా చేతులు మారాయని.. రూ. 500 కోట్లు అదనంగా చెల్లింపులు జరిగాయని చెప్పారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కొత్తగూడెంలో సింగరేణి హెడ్‌ఆఫీస్‌కి వెళ్లి రివ్యూ చేస్తున్నారని మాకు సమాచారం ఉందన్నారు. కిషన్‌రెడ్డి రెండేళ్లు బొగ్గు మంత్రిగా ఉన్నా కూడా ఇప్పటిదాకా పట్టించుకోలేదని, బీఆర్‌ఎస్ బయట పెడితేనే ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ అయిందని హరీశ్‌రావు అన్నారు. ఢిల్లీ కిషన్‌రెడ్డి.. గల్లీకి వచ్చి కొత్తగూడెంలో సింగరేణిపై మీటింగ్ పెడుతున్నారని అన్నా రు. ఈ కుంభకోణంపై విచారణ జరపాలని కిషన్‌రెడ్డికి విపులంగా  ఒక లేఖ రాస్తున్నానని ప్రకటించారు. 

కిషన్‌రెడ్డికి లేఖ.. 

శ్రీరాంపూర్ ఓబీ టెండర్ ఏడుసార్లు ఎందుకు వాయిదా పడ్డదో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విచారణ చేపట్టాలని సూచించారు. ఇది కూడా సైట్ విసిట్ సర్టిఫికెట్‌తోనే టెండర్లను ఖరారు చేస్తున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినంక మొత్తం సైట్ విసిట్ సర్టిఫికెట్‌తో 6 ఓబి కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచారని, ఈ ఆరు ఓబీ కాంట్రాక్టర్లను వెం టనే రద్దు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సైట్ విసిట్ సర్టిఫికెట్‌తో టెండర్లను పిలిచిన ప్రతి టెండర్‌ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

జైపూర్‌లో సింగరేణి కడు తున్న థర్మల్ పవర్ ప్లాంట్‌లో కూడా అవకతవకలు జరిగాయని, వాటి మీద కూడా త్వరలో సమాచారం బయట పెడతామని, వాటి మీద కూడా కిషన్ రెడ్డి విచారణ జరిపించాలన్నారు. రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ ఉంటే నీ బావమరిది సృజన్ రెడ్డిపై సిట్ వేయాలని, సింగరేణి కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బం ధం లేకపోతే ఇప్పటివరకు పిలిచిన అన్ని టెండర్లు రద్దు చేయాలని, పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచారణ సిట్టింగ్ జడ్జితో జరుపుతారో, సీబీఐతో జరుపుతారో మీ ఇష్టమని, అన్ని విషయాలు బయటకు తేవాలని సూచించారు. 

ప్రకాశం ఖని స్కాం... శ్రీరాంపూర్ ఓబీ మరో స్కామ్.. 

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫీల్ విజిట్ సర్టిఫికెట్ అనేది పెట్టడం వల్లనే ఈ స్కాం బయటపడిందన్నారు. ఇక్కడ కూడా సైట్ విసిట్ సర్టిఫికెట్ పెట్టి టెండర్‌ని పిలిచారని, ఫిబ్రవరి రెండో తారీఖు గడువు ఉందని, ఇక్కడ కూడా రింగు చేస్తున్నారని.. మరి సైట్ విసిట్ విధానం తప్పయితే ప్రకాశం గని టెండర్‌ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూ. 1,044 కోట్లతో సైట్ విసిట్ సర్టిఫికెట్ పెట్టి ఈ టెండర్‌ని కూడా పిలిచారు కాబట్టి ప్రకాశం గని టెండర్‌ని కూడా తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

శ్రీరాంపూర్‌లో ఓబీ రూ. 600 కోట్ల వర్క్ టెండర్ పిలిచారని, టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్ బిడ్డు కోసం ఏడుసార్లు డేట్ ఇచ్చి వాయిదా వేశారని తెలిపారు. రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి చెప్పడంతో ఫైనాన్షియల్ బిడ్డును ఏడుసార్లు వాయిదా వేశారని చెప్పారు. హైదరాబాద్ హోటల్‌లో ముఖ్యమంత్రి బావమరిది సృజన రెడ్డి సెటిల్మెంట్లు కుదరకపోవడం వల్ల ఏడుసార్లు వాయిదా వేశారని ఆరోపించారు. 

సీఎం బామ్మర్ది కోసమే..

రేవంత్ రెడ్డి బావమరిది కోసమే సింగరేణిలో భారీ కుంభకోణాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్‌రెడ్డి అవినీతి బాగోతాలను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆధారాలతో సహా రేవంత్ రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి బాగోతం బయటపెట్టినందుకే డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయన్నారు. గతంలో తెలంగాణలో తెలంగాణ సిరుల గని సింగరేణి అనే మాట ఉండేదని, ప్రస్తుతం సింగరేణి సృజన్ గనిగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.

ఒక మంత్రి తన సోదరుని కంపెనీకి సైట్ విసిట్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వడం లేదని ఏకంగా అధికారికి ఉత్తరం రాశారని, ఈ వాటాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారిందన్నారు. అందుకే సిట్ పేరు మీద రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారని, ఇదొక మైన్ బ్లాక్ కుంభకోణం కాదు. ఇది చాలా పెద్ద కుంభకోణమని ఆరోపించారు. బావమరిది సృజన్‌రెడ్డి కోసం చేసిన ఈ కుంభకోణం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారిందని, మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిందని, ఇలా ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదన్నారు.

రేవంత్ రెడ్డి చేసిన ఈ బొగ్గు కుంభకోణం వల్ల తెలంగాణ ప్రతిష్ట దెబ్బతిన్నదని, కోల్ స్కాం ఎట్లా అయితే యూపీఏ ప్రభుత్వ పతనానికి దారితీసిందో నేటి ఈ బొగ్గు కుంభకోణంతో కాంగ్రెస్ పతనానికి బీజం పడిందన్నారు. ఈ గండం గట్టేక్కేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీతో కుమ్మక్కై ఈ సిట్ల డ్రామా చేస్తున్నారని, ఈ డ్రామాలో భాగంగా మొన్న నాకు, నేడు కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. మీరు ఎన్ని చేసినా మీ అవినీతిని బయట పెట్టకుండా ఊరుకోబోమని, మీ చిట్టాలను బయటపెడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీంగా సిట్.. 

ఈరోజు రాష్ట్రంలో సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు.. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీంగా మారిందన్నారు. వరుసగా మీడియాకు లీకులు ఇస్తున్నారని, ఆ లీకులకు ఆధారాలు ఏమిటి అని ప్రశ్నించారు. మీడియా సంస్థలు కూడా నిజంగానే జరుగుతున్నట్టు ఆ లీకులను ప్రసారం చేస్తున్నాయని, వాస్తవ పరిస్థితులు వేరు.. ఇస్తున్న లీకులు వేరు అన్నారు. మొన్న నేను ఇన్వెస్టిగేషన్‌కి వెళ్ళినప్పుడు కూడా నాపైన ఇలాంటి దుష్ప్రచారం చేశారని, వాస్తవానికి జరిగింది వేరు.. బయట లీకులు ఇస్తూ ప్రచారం చేయించిన స్క్రిప్ట్ వేరు అని స్పష్టం చేశారు.

ఒకరకంగా ఇది రాజ్యాంగం మీద దా, వ్యక్తిత్వ హననం అవుతుందన్నారు. ఈ లీకులకు బాధ్యత వహించాలి?, లీకులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి కదా అని నిలదీశారు. కేటీఆర్ విషయంలో కూడా మీరు పదే పదే దుష్ప్రచారాన్ని, తప్పుడు లీకులను ప్రసారం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లీకు వార్తల విషయంలో చిల్లర రాజకీయాలు, డ్రామాలు చేస్తోందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనమని, చాతకాని వాళ్ళు చేసేపని ఇదని ఎద్దేవా చేశారు. ‘రేవంత్ రెడ్డీ.. నీకు ధైర్యం ఉంటే వీడియో బయట పెట్టాలి. దమ్ముంటే నువ్విచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయాలి’ అని సవాల్ చేశారు.