calender_icon.png 8 October, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక వడ్డీ ఆశ చూపి 600 కోట్లు మోసం

08-10-2025 01:25:12 AM

-అప్పుచేసి రూ.కోటి ఇచ్చిన ఓ బాధితుడు

-తీసుకుని తిరిగి చెల్లించని నిందితుడు

-మనస్థాపంతో బాధితుడి ఆత్మహత్య

-నిందితుడు బాలాజీనాయక్ ఇంటికి నిప్పు పెట్టిన మృతుడి బంధువులు

-నల్లగొండ జిల్లా పలుగు తండాలో ఘటన

-రూ.600 కోట్లు బాలాజీ నాయక్‌కు ఇచ్చి, మోసపోయిన వేలమంది బాధితులు

దేవరకొండ, అక్టోబర్ 7: అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపి, రూ.కోటి తీసుకుని ముఖం చాటేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటన మంగళవారం నల్లగొండ జిల్లాలో జరిగింది. పీఏపల్లి మండలం పలుగు తండా గ్రామానికి చెందిన బాలాజీ నాయక్ అధిక వడ్డీ ఆశ చూపి వేలమంది బాధితుల వద్ద దాదాపు రూ.600 కోట్లు వసూలు చేశాడు. కొన్నాళ్లపాటు వడ్డీని సక్రమంగా చెల్లించిన బాలాజీనాయక్ గత మూడు నెలల నుంచి చేతులెత్తేశాడు. ఈ క్రమంలోనే పీఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మిర్యాలగూడలో స్థిరపడ్డాడు.

ఇతరుల వద్ద అప్పుచేసి బాలాజీ నాయక్‌కు రూ.కోటి వడ్డీకి ఇచ్చాడు. బాలాజీ నాయక్ గత 15 రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. అంతేకాకుండా అప్పు ఇచ్చినవారి వేధింపులు ఎక్కువ కావడంతో మనస్థాపానికి గురై మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు బాలాజీ ఇంటిని ముట్టడించి సామాన్లు ధ్వంసం చేసి, ఫర్నిచర్ తగులబెట్టారు. బాలాజీ నాయక్ ఇంటికి నిప్పు పెట్టారు. బాలాజీనాయక్‌ఫై గతంలో కలెక్టర్ ఇలా త్రిపాటికి కొందరు ఫిర్యాదు చేశారు. 

నిందితుడికి ప్రజాప్రతినిధుల అండ? 

కలెక్టర్.. ఎస్పీని ఆదేశించగా.. ఎస్పీ శరత్ చంద్ర పవర్ బాలాజీ నాయక్‌ను పిలిపించి బాధితులకు న్యాయం చేయాలని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినా కూడా బాలాజీ నాయక్ పట్టించుకోకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అందుబాటులోకి రాలేదు. నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధు, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారుల అండదండలు ఉన్నాయని పలువురు బాధితులు ఆరోపి స్తున్నారు.