calender_icon.png 18 January, 2026 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనమంతా జనం.. వన దుర్గమ్మకు నీరాజనం

18-01-2026 02:18:09 PM

  1. ఏడుపాయల్లో మాఘ స్నానమాచరించిన వేలాదిమంది భక్తజనం 
  2. జనారణ్యంగా మారిన మంజీరా తీరం 
  3. మార్మోగిన వనదుర్గమ్మ నామస్మరణ  
  4. మాఘ స్నానమాచరించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు  

విజయక్రాంతి,పాపన్నపేట: ఏడుపాయలకు జన "గంగ" పోటెత్తింది. ఎల్లలు దాటి వచ్చిన వేలాదిమంది భక్తజనంతో ఏడుపాయల క్షేత్రం జనారణ్యమైంది. ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తజనంతో వనమంతా కిక్కిరిసిపోయింది. పవిత్ర మంజీరాలో మాఘ స్నానం ఆచరించి భక్తి పరవశులయ్యారు. అనంతరం వనదుర్గమ్మను దర్శించి  నీరాజనం పలికారు. ఆలయ అర్చకులు వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలు, సారే, కిరీటంతో అందంగా తీర్చిదిద్దారు.

సారే, కిరీటం, ముక్కుపుడక, పుష్పాల అలంకరణలో వన దుర్గమ్మ శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. చల్లంగా చూడమ్మా.. వన దుర్గమ్మ తల్లి.. అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. చెక్ డ్యాం, వనదుర్గా ప్రాజెక్టు, అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీరా నదీపాయల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎంతో సౌకర్యంగా మారింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కలిసి జల్లుల కింద ఉత్సాహంగా పుణ్యస్నానాలు ఆచరించి తల్లికి నీరాజనం పలికారు. వన దుర్గమ్మ నామస్మరణలతో ఏడుపాయల పరిసర ప్రాంతాలు హోరెత్తాయి.

పలువురు భక్తులు సాంప్రదాయబద్ధంగా అందంగా తీర్చిదిద్దిన గండ దీపాలు, బోనాలను డప్పు చప్పుల్ల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మకు సమర్పించారు. అనంతరం ఆలయ పరిసరాల్లోని షెడ్లు, పచ్చని చెట్ల కింద భోజనాలు చేసి సాయంత్రం ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి చంద్రశేఖర్, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. పలువురు భక్తులు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. సుమారు 250 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.