calender_icon.png 18 January, 2026 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మా అనుమతుల రద్దుపై గ్రామపంచాయతీ తీర్మానం

18-01-2026 02:22:30 PM

బిక్నూర్ యువత హర్షం

భిక్కనూర్,(విజయక్రాంతి): ఫార్మా కంపెనీకి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేస్తూ బిక్నూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం తీసుకున్న తీర్మానంపై గ్రామ యువత హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్మానం గ్రామ భవిష్యత్తును కాపాడే చారిత్రాత్మకమైన, ప్రజాపక్ష నిర్ణయమని యువత అభివర్ణించింది. గ్రామ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, రాబోయే తరాల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మొత్తం గ్రామపంచాయతీ పాలకవర్గం ధైర్యంగా నిలవడం అభినందనీయమని యువత పేర్కొంది.

ఈ సందర్భంగా బిక్నూర్ గ్రామ యువత మాట్లాడుతూ, ఈ తీర్మానం గ్రామ ఐక్యతకు నిదర్శనమని, ప్రజాస్వామ్యానికి గెలుపని, ప్రజల శక్తికి ప్రత్యక్ష సాక్ష్యమని తెలిపారు. గ్రామ హితానికి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సరైన నిర్ణయంలో తమ మద్దతు ఎప్పుడూ పాలకవర్గానికి ఉంటుందని స్పష్టం చేశారు. ఫార్మా కంపెనీ రద్దు కోసం చేపట్టే ప్రతి పోరాటంలో ముందుండి పాల్గొంటామని, కాలుష్యరహితమైన బిక్నూర్ గ్రామం కోసం పోరాటం కొనసాగిస్తామని యువత ప్రకటించింది. “ప్రజల ఆరోగ్యం మా తొలి ప్రాధాన్యం… ఫార్మా ఫ్యాక్టరీలు వద్దు” అంటూ నినాదాలు చేశారు.