25-10-2025 01:07:53 AM
పోలీసు విధులపై ప్రత్యక్ష అవగాహన, పేలుడు పదార్థాల నిర్వీర్యంపై ప్రదర్శన
శేరిలింగంపల్లి,అక్టోబర్ 24 (విజయ క్రాంతి): పోలీసు స్మారక వారోత్సవాల భాగంగా విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంచేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని మహిళా బాలల భద్రతా విభాగం డీసీపీ సృజన కర్ణం ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పోలీసులు కేవలం నేరస్థులను పట్టుకోవడానికే కాదు,సమాజంలో శాంతి భద్రతలు, చట్టపరమైన అవగాహన పెంపు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
ప్రతి విద్యార్థి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, సమాజంలో భద్రత ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోవాలని సూచించారు.సైబరాబాద్ పరిధిలోని ఐదు జోన్లకు చెందిన సన్షైన్ గ్లోబల్ స్కూల్, ఇండియన్ పీపుల్ స్కూల్, శ్రీ గౌతమ్ హై స్కూల్తో పాటు పలు విద్యాసంస్థల నుండి సుమారు 550 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు కూడా నిర్వహించారు.
బాంబ్ డిస్పోజల్ టీమ్ పేలుడు పదార్థాల గుర్తింపు,నిర్వీర్య పరికరాలు,బాంబ్ సూట్, బాంబ్ బ్లాంకెట్, వాహన తనిఖీ అద్దం, మెటల్ డిటెక్టర్లు, సాధనాలు వివరంగా చూపించారు. స్నిఫర్ డాగ్స్ తమ ప్రతిభతో ఆకట్టుకోగా, విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు.ఇక మౌంటెడ్ పోలీస్ విభాగం గుర్రపు స్వారీతో ఆకట్టుకోగా, సైబరాబాద్ స్పెషల్ పార్టీ చేసిన సైలెంట్ డ్రిల్, బ్యాండ్ డ్రిల్ విద్యార్థులను ఉత్సాహపరిచాయి.
పోలీస్ జీవితం, క్రమశిక్షణ, కఠిన శిక్షణ పట్ల విద్యార్థులు ప్రత్యక్ష అనుభవం పొందారు.ఈ కార్యక్రమంలో సీఏఆర్ హెడ్క్వార్టర్స్ ఏడీసీపీ షమీర్, ఏసీపీ అరుణ్కుమార్, డబ్ల్యూఅండ్సీఎస్డబ్ల్యూ ఇన్స్పెక్టర్ యడయ్య, ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ జేమ్స్బాబు, ఆర్టీఓలు ప్రశాంత్బాబు, వీరలింగం, నాగరాజు రెడ్డి, హిమాకర్, నాగరాజు, జంగయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంపు, పోలీస్ వ్యవస్థపై సానుకూల దృక్పథం కలిగించే లక్ష్యంతో సైబరాబాద్ పోలీస్ చేపట్టిన ఈ ఓపెన్ హౌస్ విద్యార్థులను ఉత్సాహపరిచింది.