calender_icon.png 25 October, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహితీ స్కామ్ కేసులో ఈడీ దూకుడు!

25-10-2025 01:06:06 AM

  1. సాహితీ ఇన్‌ఫ్రా చేపట్టిన ఏ ప్రాజెక్టుకూ అనుమతుల్లేవని గుర్తింపు
  2. వినియోగదారుల సొమ్ముతో డైరెకర్లు స్థిరాస్తుల కొనుగోలు
  3. నిధులు దారిమళ్లించినట్లు ఆధారాలు సేకరణ
  4. తాజాగా మరో రూ.12.65 కోట్ల ఆస్తులు అటాచ్  

హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 24 (విజయక్రాంతి) : సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకున్న వేలాది మధ్యతరగతి కుటుంబాలను నిలువునా ముంచిన సాహితీ ఇన్‌ఫ్రాటెక్ భారీ మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ప్రీ-లాం ఆఫర్ల పేరుతో సుమారు 2500 మందికి పైగా వినియోగదారుల నుంచి దాదాపు రూ.900 కోట్లు వసూలు చేసి, వారిని మోసగించిన ఈ కేసులో తాజాగా మరో రూ.12.65 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.174.15 కోట్లకు చేరింది.

ఎలా మోసం చేశారు?

సాహితీ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు బూదాటి లక్ష్మీనారాయణ, బూదాటి పూర్ణచందర్‌రావు నేతృత్వంలో హైదరాబాద్ శివారులోని అమీన్‌పూర్, పటాన్‌చెరు, కొంపల్లి, బాచుపల్లి వంటి ప లు ప్రాంతాల్లో భారీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్సులు నిర్మిస్తున్నట్లు ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చారు. మార్కెట్ ధర కంటే చా లా తక్కువకే ప్లాట్లు ఇస్తామని, ప్రీ-లాం ఆఫర్‌లో భాగంగా బుక్ చేసుకుంటే తక్కువ ధరకే వస్తాయని నమ్మబలికారు.

ఈ మాటలను నమ్మిన వేలాది మంది ఐటీ ఉద్యో గులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నారైలు, మధ్యతరగతి ప్రజలు తమ జీవితకాల సంపాదనను, అప్పులు చేసి మరీ ప్లాట్ల కోసం 40% నుంచి 90% వరకు డబ్బును అడ్వాన్సులుగా చెల్లించారు. ఇలా సుమారు 2500 మంది నుంచి రూ.842 కోట్లకు పైగా వసూలు చేశారు. అయితే, సంవత్సరాలు గడుస్తున్నా ప్రాజెక్టుల ని ర్మాణం ప్రారంభం కాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

దర్యాప్తులో పలు వాస్తవాలు..

హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సీసీఎస్ పోలీసులు బాధితుల ఫిర్యాదుల ఆధా రంగా 50కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా, భారీగా నగ దు చేతులు మారడంతో ఈడీ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.  సాహితీ ఇన్‌ఫ్రా చేపట్టిన ఏ ప్రాజెక్టుకూ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఈడీ గుర్తించింది.

వినియోగదారుల నుంచి వసూలు చేసిన రూ.842 కోట్లను ప్రాజెక్టుల నిర్మాణానికి కాకుండా, కంపెనీ డైరెక్టర్లు తమ సొంత వ్యాపారాలు, ఇతర షెల్ కంపెనీలకు మళ్లించారు. ఆ డబ్బుతో తమ, తమ కుటుంబ సభ్యుల పేర్లపై పెద్ద ఎత్తున స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది.

లెక్కల్లో చూపని నగదు

వసూలు చేసిన మొత్తంలో రూ.216.91 కోట్లను నగదు రూపంలో స్వీకరించి, వాటిని కంపెనీ అధికారిక లెక్కల్లో చూపకుండా నల్లధనంగా మార్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఆధారాలతో ఈడీ మొదట రూ.161.50 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. తాజాగా శుక్రవారం మరో రూ.12.65 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. కేసులో ప్రధాన నిందితులైన డైరెక్టర్లు బూదాటి లక్ష్మీనారాయణ, పూర్ణచందర్‌రావులను పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రస్తుతం వారు జైలులో ఉన్నారు. ఈడీ దర్యాప్తు కొనసాగుతోందని, మోసానికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.