01-12-2025 08:54:47 AM
హైదరాబాద్: దిత్వా తుఫాన్(Cyclone Ditwah) సముద్రంలో బలహీనపడింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా తుఫాను సోమవారం ఉదయం నాటికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తుఫాన్ తమిళనాడు-దక్షిణకోస్తా తీరానికి 30 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో దిత్వా తుఫాన్ వాయుగుండంగా బలహీనపడనుంది. రాగల 12 గంటల్లో ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
దిత్వా తుఫాను తీవ్రత తగ్గినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. నెల్లూరు నుండి కృష్ణ వరకు భారీ వర్షాలు, ఆకస్మిక వరదల వచ్చే అవకాశమున్నందున అధికారులు హై అలర్ట్‌లో ఉన్నారు. హోం మంత్రి వి అనిత, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ ఆదివారం తమ తమ శాఖలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
సోమవారం అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, యానాంలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తీరప్రాంతంలో గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ హెచ్చరించారు.