26-10-2025 05:30:46 PM
ఆందోళనలో ప్రజలు..
విచారణ చేస్తున్న పోలీసులు..
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు రాత్రి వేళల్లో డ్రోన్ కెమెరాలతో చక్కర్లు కొడుతున్నారు. డ్రోన్ కెమెరాలు చక్కర్లు ఎందుకు పడుతున్నాయో తెలియక ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు. పెద్దముల్ మండలం నాగులపల్లి, నర్సాపూర్, రుద్రారం, తాండూర్ పట్టణంలో గత రెండు రోజుల నుండి రాత్రి వేళల్లో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు డ్రోన్ కెమెరాతో ఏవైనా రహస్య వివరాలు సేకరిస్తున్నారా? ఇంకా మరి ఏదైనా కారణం ఉందా తెలియక ప్రజలు అయోమయంలో పడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. లాడ్జింగ్, హోటల్లో, ఫామ్ హౌస్ లలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు డ్రోన్ కెమెరాలతో తిష్ట వేశారా? అనే కోణంలో సోదాలు చేపట్టారు. కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తుంటే 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.