అతి నిద్ర ప్రమాదం
వాతావరణ మార్పుల వల్ల చల్లటి వాతావరణంలో చల్లటి పదార్థాలు తింటే జలుబు వస్తుంది. కానీ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా త్వరగా జలుబు వస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రోజులో కనీసం 7 గంటల కంటే తక్కువ నిద్ర పోయే వారికి జలుబు చేస్తుంది. అంతే కాకుండా మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి నిద్రపై ప్రతీ ఒక్కరికి శ్రద్ధ చాలా అవసరం.. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో 8 గంటల నిద్ర తప్పనిసరి.. ఎక్కువ నిద్ర తక్కువ నిద్ర రెండు ఆరోగ్యానికి మంచివి కావు.
తక్కువ నిద్రతో బాధపడుతున్న వారిలో చాలా వరకు మధుమేహం, బీపీ, హార్ట్ ఎటాక్, ఊబకాయం వంటి దీర్ఘ కాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిద్రలేమి వారికి ఆకలి పుట్టించే హార్మోన్ గ్రేలిన్ ఎక్కువగా విడుదలై ఆకలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో కడుపు నిండిందనే భావన కల్పించే హోర్మోన్ లెఫ్టిన్ తక్కువగా విడుదలై ఎక్కువగా ఆహారం తీసుకోవడంతో ఊబకాయానికి దారితీస్తుంది. అంతేకాకుండా నిద్రలేమి ప్రభావం మెదడు పనితీరుపై కూడా ఉంటుంది. ప్రతిరోజూ మెదడులో కొన్ని వ్యర్థ కణాలు పెరుగుతాయి. నిద్రపోయినప్పుడు అవి తొలగిపోతాయి. అందుకే మనిషికి సరిపడా నిద్ర లేకపోతే ఆ వ్యర్థకణాలు మెదడులో పేరుకుపోయి.. మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి.






