22-07-2025 04:28:46 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలనీ జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ కోరారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ముల్కల రైతు వేధికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎక్కడైతే భూమి ఉన్నదో సమీప రైతు వేధికలో నమోదు చేసుకోవాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం పథకాల వల్ల వచ్చే లబ్దిని రైతులు పొందగలరని సూచించారు.
జిల్లాలో యూరియా కొరత లేదనీ, సరిపడా యూరియా జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా పంపిణీ జరుగుతుందని, రైతు ఆధార్ కార్డుతో ఈపాస్ మెషీన్ ద్వారా యూరియా కొనుగోలు చేయాలన్నారు. ఒక వరి పంట కాలంలో 60 నుంచి 70 కిలోల యూరియా, ఒక బస్తా పొటాష్, ఒక బస్తా టిఏపినీ మూడు దఫాలుగా ప్రతి 30 రోజులకు పంటకి వేసుకోవాలన్నారు. అలాగే పచ్చి రోట్ట పూత దశలో ఉన్నప్పుడు దాన్ని కలియ దున్ని ఒక బస్తా డి ఏ పి కి బదులుగా, సింగిల్ సూపర్ పాస్పెట్ నీ వినియోగిస్తే పచ్చి రొట్టా మురిగి, భూమికి సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు పంటకి అందుతాయనీ సూచించారు.
పొలం గట్లవెంట కంది పంటను, కూరగాయలు వేస్తే రైతు కుటుంబానికి అదనపు ఆదాయం సమకూరుతుందనీ, సంప్రదాయ పంటలైన వరి, పత్తి పంటలు కాకుండా పప్పు దినుసులు వేయాలన్నారు. ప్రస్తుతం సబ్సిడీ ఉన్న ఆయిల్ పామ్ పంటలు వేసేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడిఏ అనిత, హాజీపూర్ ఏ ఓ క్రిష్ణ, ఆత్మ డైరెక్టర్ కుమార్ యాదవ్, ఫెర్టిలైజర్ డీలర్స్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు ఇతర డీలర్స్, ముల్కల్ల గ్రామ అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు.