22-07-2025 10:44:50 PM
బాధితుడిని పరామర్శించిన కాంగ్రెస్ ఇంచార్జి భీమ్ భరత్
చేవెళ్ల/మొయినాబాద్: కరెంట్ షాక్ తో 50 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. బాధితుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం(Moinabad Mandal) నాగిరెడ్డిగూడ గ్రామానికి చెందిన కోడ్చర్ల కుమార్ యాదవ్ 20 ఏళ్లు గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు 70 గొర్రెల ఉండగా ఎప్పటిలాగే సోమవారం గొర్రెలను మేపుకొచ్చి కొట్టంలో ఉంచాడు. మంగళవారం ఉదయం వెళ్లి చూడగా కుప్పలు తెప్పలుగా చనిపోయి కనిపించాయి. కొట్టం గోడకు ఉన్న మీటర్ వైరు తెగి రేకులకు తగలడంతో స్తంభాలకు షార్ట్ సర్క్యూట్ వచ్చి గొర్రెలకు షాక్ కొట్టినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు, వెటర్నరీ ఆఫీసర్లు, సెక్రటరీ అక్కడికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మొత్తం 50 గొర్రెలు చనిపోయి దాదాపు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. గొర్రెలు అమ్మి తన కూతురు పెళ్లి చేద్దామనుకున్నానని, ఇంతలోనే ఇలా జరిగిపోయిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి పామెన భీమ్ భరత్ ఘటనాస్థలానికి వెళ్లి బాధితుడిని పరామర్శించి.. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే తహసీల్దార్, విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి నష్టపరిహారం ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భీమ్ భరత్ వెంట మొయినాబాద్ మండల అధ్యక్షుడు మానయ్య, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ గణేష్ గౌడ్, బాకారం మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, నాగి రెడ్డి గూడ గ్రామానికి చెందిన సంజీవ రెడ్డి, మాణిక్యం, గ్రామస్తులు ఉన్నారు.