16-10-2025 02:45:28 AM
ప్రస్తుత అధ్యక్షులకు నో ఛాన్స్
ఏఐసీసీ నిబంధనలతో పలువురు ఆశావహులకు నిరాశ
నిబంధనలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు
మేడ్చల్, అక్టోబర్ 15(విజయ క్రాంతి): జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి అరుల విషయంలో ఏఐసీసీ జారీ చేసిన నిబంధనల వల్ల పలువురు ఆశావహుల ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పటికే కార్యకర్తల అభిప్రాయం మేరకు అధ్యక్షుడిని ఎంపిక చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. ప్రస్తుతం అధ్యక్ష పదవి కోసం అభిప్రాయ సేకరణ జరుగుతోంది. మూడు చోట్ల అభిప్రాయ సేకరణ పూర్తయింది.
మరో నాలుగు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. మూడుచోట్ల పూర్తయిన తర్వాత కొత్త నిబంధనలో రావడంతో అయోమయం నెలకొంది. మూడు చోట్ల జరిగిన అభిప్రాయ సేకరణలో కార్యకర్తలు, నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రారంభంలోనే ఈ నిబంధనలు చెబితే ఇందుకు అనుగుణంగా అభిప్రాయాలు చెప్పే వారి మని కార్యకర్తలు అంటున్నారు.
అధ్యక్ష పదవి చాలామంది ఆశిస్తున్నప్పటికీ ప్రధానంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, ప్రస్తుత అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్ వినిపించాయి. ఇందులో బీసీ కోటాలో శ్రీశైలం గౌడ్, ఓసి కేటగిరీలో హరి వర్ధన్ రెడ్డి కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా కొత్త నిబంధనలు వీరిద్దరి అవకాశాల మీద ప్రభావం చూపుతున్నాయి.
ఐదేళ్లు పార్టీ కోసం పనిచేసే ఉండాలని నిబంధన వల్ల శ్రీశైలం గౌడ్ కు ప్రతిబంధకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి డిసిసి పదవి ఆశిస్తున్నారు. హరి వర్ధన్ రెడ్డి విషయంలో సందిగ్ధం ఏర్పడింది. మాజీ అధ్యక్షులకు అవకాశం లేదని నిబంధన పెట్టారు.
ఈయన అధ్యక్షుడిగా పూర్తి కాలం పనిచేయలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా అధ్యక్షుడు పార్టీ మారడంతో హరివర్ధన్ రెడ్డిని ఆ పదవిలో నియమించారు. పూర్తి కాలం పదవిలో కొనసాగనందున మరోసారి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే.
నక్క ప్రభాకర్ గౌడ్ గట్టిగా ప్రయత్నించినప్పటికీ ఆయన ఐదేళ్లు పార్టీలో లేరు. వేరే పార్టీ నుంచి మధ్యలో వచ్చారు. వజ్రేస్ యాదవ్ కూడా జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. ఆయన మేడ్చల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. రెండు పదవులలో కొనసాగిస్తారా అనేది సందేహంగా మారింది.
కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు
ఏఐసీసీ నిబంధనలపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్న వారు ఈ నిబంధనలపై హర్షం వ్యక్తం చేస్తుండగా, కొత్తగా చేరిన వారు అసంతృప్తి వెళ్ళగకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో లేదు. దీంతో చాలామంది వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. కొద్దిమంది మాత్రమే పార్టీలో ఉన్నారు. వీరు కష్టకాలంలో పార్టీ ఉనికి కాపాడారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదురొడ్డి నిలిచారు.2023 ఎన్నికల సమయంలో, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పార్టీల నుంచి నాయకులు చేరడంతో వారి ప్రాధాన్యం తగ్గింది. కొత్త నిబంధనల వల్ల తమకు గుర్తింపు లభించినట్లు అయిందని వారు అంటున్నారు. ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన వారు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివిధ పార్టీల నుంచి వచ్చి తమ కాంగ్రెస్ లో చేరడం వల్లే పార్టీకి ఊపు వచ్చిందని, నిబంధనల పేరుతో తమను వేరు చేయడం సరికాదని అంటున్నారు. భవిష్యత్తులో అన్ని పదవులకు ఇలాంటి నిబంధనలు పెడితే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్లో చేరామని, గుర్తింపు, పదవులు ఇవ్వకపోవడం సరికాదంటున్నారు.
పాత వర్సెస్ కొత్త
మేడ్చల్ జిల్లాలో క్యాడర్ మధ్య ఇదివరకే పాత వర్సెస్ కొత్త అనే వివాదం కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పార్టీలో డామినేట్ చేస్తున్నారు. దీనిని పార్టీలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈనెల 13న షామీర్పేట్ మండలం అంతా పల్లి లో జరిగిన మేడ్చల్ నియోజకవర్గం కార్యకర్తల అభిప్రాయ సేకరణ సమావేశంలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పదవులు మీకేనా మాకు వద్ద అని గతంలో నుంచి కొనసాగుతున్న వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.