16-10-2025 02:41:18 AM
-మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పిలుపు
-తమ రాష్ట్రంలో మావోయిస్టులు కార్యకలాపాలు తగ్గిపోయాయని వెల్లడి
-మల్లోజుల వేణుగోపాల్‌లొంగుబాటు హర్షణీయం
-పోలీస్ అధికారులు మావోయిస్ట్ నేతలతో చర్చలు జరపాలని సూచన60మంది సహచరులతో కలిసి లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్
-ముఖ్యమంత్రి సమక్షంలోనే పోలీసులకు ఆయుధాలు అప్పగింత
-ఛత్తీస్‌గఢ్‌లో 77 మంది మావోయిస్టుల సరెండర్
గడ్చిరోలి, చర్ల, అక్టోబర్ 15 : మావోయిస్టులు అజ్ఞాతం వీడి జన జీవన స్రవంతిలో కలవాలని మహారాష్ట్ర సీఎం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పిలుపునిచ్చారు. హింసామార్గంలో సాధించేది ఏమీ లేదని.. జనంలోకి వచ్చి సమస్యలపై ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడాలని సూచించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తమను తాము ఆత్మార్పణ చేసుకోకుండా ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినయోగం చేసుకోవాలని చెప్పారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. సీఎం సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల, ఆయన బృందాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు.
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్రలో మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయానని తెలిపారు. దక్షిణాదిన ఉన్న మావోయిస్టు దళాలు, పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో, ఏయే స్థాయిలో వీలైతే పోలీసులు వారితో చర్చలు జరిపి జనజీవ స్రవంతిలో కలిసేలా చూడాలని సూచించారు.
ఆయుధం వీడి రాజ్యాంగం పరిధిలో పనిచేస్తా : మల్లోజుల
ఆయుధం పక్కనబెట్టి రాజ్యాంగం పరిధిలో పనిచేస్తానని జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన అనంతరం ఆయన మీడియాతో అన్నారు. ఆ సమయంలో ఆయన భారత రాజ్యాంగం మరాఠి ప్రతిని పట్టుకుని కనిపించారు.
పొలిట్‌బ్యూరో నుంచి వైదొలిగి..
మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొంతకాలంగా మల్లోజుల బహిరంగ లేఖలు రాశారు. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్‌బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నాయి.
అన్న పిలుపుతో ఉద్యమంలోకి..
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్ మూడో సంతానం. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి పొందారు. చదువు పూర్తియిన తర్వాత అన్న పిలుపు మేరకు ఉద్యమంలోకి ప్రవేశించారు. పార్టీలో ఆయనను అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు.
భద్రతా దళాల నిరంతర ఆపరేషన్‌తో 27మంది మావోలు..
చర్ల, అక్టోబర్15 : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట బుధవారం 27మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో పది మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భద్రతా దళాల నిరంతర ఆపరేషన్‌తోనే మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిందుకు సిద్ధపడుతున్నారని ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. లొంగిపోయిన వారిపై రూ.50లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు అజ్ఞాతం వీడాలని సూచించారు.
మల్లోజుల బాటలోనే ఆశన్న
-మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్ల పల్లి వాసుదేవరావు సరెండర్?
-నేడు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట 70మంది సహచరులతో కలిసి లొంగిపోయేందుకు రంగం సిద్ధం
-మావోయిస్టు పార్టీకి మరో షాక్
మావోయిస్టు పార్టీకి మరో పెద్ద షాక్ తగలబోతోంది. పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ బాటలోనే కేంద్రకమిటీ సభ్యుడు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ కూడా నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే దాదాపు 70మంది సహచరులతో కలిసి గురువారం ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోయేందుకు వాసుదేవరావు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలంలోని నర్సింగాపూర్ గ్రామం.
నాలుగు దశాబ్దాల క్రితం పిపుల్స్ వార్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో, ఆపై అప్పటి హనుమకొండ మండలం కాజీపేటలోని ఫాతిమా స్కూల్ సెకండరీ విద్య అభ్యసించారు. కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్‌ఎస్‌ఎస్)కు నాయకత్వం వహించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 25ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం వాసుదేవరావు వయస్సు 60ఏళ్లు పైబడి ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా.
కాంకర్‌లో యాభై మంది మావోయిస్టులు లొంగుబాటు
-18 మంది పురుషులు.. 32 మంది మహిళలు
-పోలీసులకు 39 ఆయుధాలు అప్పగింత
చర్ల, అక్టోబర్ 15 (విజయక్రాంతి): చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బస్తర్‌లోని కాంకేర్‌లో బుధవారం మావోయిస్టుల ఉత్తర బస్తర్ డివిజన్ ఇన్‌చార్జి రాజ్మాన్ నాయకత్వంలో 50 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తమ వద్ద ఉన్న 39 ఆయుధాలను కూడా తీసుకువచ్చి అప్పగించారని, వారిలో 18 మంది పురుషులు 32 మంది మహిళలు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. మావోయిస్టుల కిస్కోరోడో ఏరియా కమిటీ కార్యదర్శి డీవీ సీఎం రాజు సలాం కూడా లొంగిపోయిన వారి లో ఉన్నాడు. అంతకుముందు బస్తర్ ఐజీ పి. సుందర్రాజ్, ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ ఎలెసెలె మావోయిస్టులతో నేరుగా సంభాషించారు. దీంతో రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లను సంప్రదించిన మావోయిస్టులు అక్కడికి చేరుకుని పోలీస్ అధికారుల సమక్షంలో లొంగిపోయారని తెలిపారు.