16-10-2025 01:39:40 AM
-మణికొండ నివాసంలో బుధవారం ఉదయం తుదిశ్వాస
-తెలుగునాట తొలి నేపథ్యగాయనిగా ప్రసిద్ధురాలు
-నుంచి పలు భాషల్లో2 వేలకు పైగా పాటలు
-బాలనటిగా గుర్తింపు
-మరో జన్మంటూ ఉంటే గాయనిగానే పుడతానని పలుసార్లు చెప్పిన బాలమ్మ
దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా తెలుగువారిని అల్లుకున్న రావు బాలసరస్వతి పాట ఎగిరిపోయింది. బాలసరస్వతి ఇక లేరన్న వార్త తెలుసుకున్న ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సంతాపం తెలిపారు. అంత్యక్రియల్లో పలువురు సినీ, సంగీత రంగ ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు.
గగనానికి గాన సరస్వతి తొలి తెలుగు గాయని రావు బాలసరస్వతి కన్నుమూత
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : లలితమైన గాత్రంలో నేపథ్య గీతాలకు సొగసులద్దిన సంగీత సామ్రాజ్ఞి ఇకలేరు. తెలుగునాట తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ మణికొండలో ఉన్న నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సాయంత్రం మహా ప్రస్థానం లో కుటుంబసభ్యులు, ఆత్మీయులు, అభిమానుల సమక్షంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి.
తెలుగు చిత్ర రంగానికి సంబంధించి జయసుధ, నరేశ్ తదితరులు హాజరయ్యారు. బాలసరస్వతికి ౯౭ ఏళ్లు. 1928లో జన్మించిన బాలసరస్వతి తన ఆరేళ్ల వయసు నుంచే పాడటం ప్రారంభించారు. ఆకాశవాణి కార్యక్రమంతో ఆమె తన గాత్రంతో తేనెలొలికించి తెలుగు వారికి ఇష్టగాయనిగా మారారు. ‘సతీ అనసూయ’ చిత్రంలో బాలసరస్వతి తొలి పాట పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో 2000కు పైగా పాటలు ఆలపించారు.
ఆమె అసలు పేరు సరస్వతిదేవి. బాల్యం నుంచే పాటలు పాడడంతో అందరూ ఆమెను బాలసరస్వతి అని పిలిచారు. ‘సతీఅనసూయ ధ్రువవిజయం’ అనే చిన్నపిల్లలు నటించిన సినిమాలో గంగ పాత్రలో కనిపించారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పాటు నటనపై ఆసక్తి లేకపోవడంతో ఆ తర్వాత ఆమె సినిమా అవకాశాలు వదులుకున్నారు. తనకు పాట అంటే ప్రాణమని బాలసరస్వతి పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. వివాహా నంతరం ఆమె పాటకు దూరమయ్యారు. 1974లో భర్త మరణానంతరం మళ్లీ పాడటం ప్రారంభించారు. తొలి తెలుగు సోలో గ్రామఫోన్ రికార్డూ ఆమెదే.
రావు బాలసరస్వతీదేవి జన్మస్థలం మద్రాసు. పార్థసారథి, విశాలాక్షి దంపతులకు 1928 ఆగస్టు 29న జన్మించారు. వీరి తాతయ్య మద్రాసు హైకోర్టులో న్యాయవాద వృత్తి చేసేవారు. ఆమె ఎక్కువ చదువుకోలేదు. గుంటూరులో వీరికి రత్న మహల్ అని సినిమా థియేటర్ ఉండేది. దాంతో వీరి తాతగారు మినహా వీరి కుటుంబమంతా గుంటూరు తరలివచ్చింది. అలత్తూర్ సుబ్బయ్య వద్ద మూడేళ్లపాటు బాలసరస్వతి కర్ణాటక సంగీతం అభ్యసించారు.
ఖేల్కర్, వసంత దేశాయ్‌ల వద్ద హిందుస్తానీ సంగీ తం నేర్చుకున్నారు. ఆరవ ఏటనే ఆమె హెచ్‌ఎంవీ కంపెనీకి ‘నమస్తే నా ప్రాణనాథ‘, ‘ఆకలి సహింపగజాల‘, ‘పరమపురుష పరంధామ‘ తదితర పాటలతో సోలో రికార్డు ఇచ్చారు. కోలంక జమీందారు రాజా రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దూర్‌ను 1944లో పెళ్లి చేసుకొని సినిమాలలో నటించడం తగ్గించిన బాలసరస్వతి, 1950 దశకం మధ్యవరకు నేపథ్యగాయనిగా మాత్రం కొనసాగారు.
గూడవల్లిగారి ‘ఇల్లాలు’
గూడవల్లి రామబ్రహ్మం ‘ఇల్లాలు’ చిత్రంలోనూ బాలసరస్వతి నటించారు. ఆ రోజుల్లో అద్భుతమైన వసూళ్లతో ఆ చిత్రం విజయఢంకా మోగించింది. తమిళ చిత్రాల్లో నటించడం వల్ల అందరూ ఆమెను తమిళ అమ్మాయి అనుకునేవారు. అరవ అమ్మాయి తెలుగుపాటలు పాడగలదా? అని అనుమానం వ్యక్తం చేసేవారు. ఆమె తెలుగు అమ్మాయని, చక్కటి పాటలు పాడగలదనీ తెలిశాక, సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుగారు పిలిచి పాటలు పాడించారు. ఈ చిత్రంలో వారు జతగా నటించారు.
రాజావారికి తెలియకుండా..
బాలసరస్వతి జీవితంలో మరువలేని సంఘటన.. భర్తకు తెలియకుండా సినిమాల్లో ఎన్నో పాటలు పాడటమే. కానీ ఒకరోజు పత్రికల్లో ఈవిడ హిట్ సాంగ్స్, నటన గురించి ఫోటోతో సహా రాశారు. పత్రికల్లో భార్య గురించి రావడం రాజావారికి నచ్చలేదు. ఆమెను పాడటం, నటించడం మానేయమన్నారు. అలా అభ్యంతరం పెట్టకుండా ఉంటే ఈమె జీవితం మరో మలుపు తిరిగి ఉండేది. కానీ ఈమె పుట్టింటికి వచ్చినప్పుడల్లా, ఇండస్ట్రీ బాధపడకూడదని..
వారు నష్టపోకూడదనీ, చాలా పాటలు భర్తకు తెలియకుండా పాడింది. స్వప్నసుందరి, పిచ్చిపుల్లయ్య, పెళ్ళిసందడి, శాంతి, షావుకారు, దేవదాసు, లైలామజ్ను, భాగ్యలక్ష్మి, మంచిమనసుకు మంచిరోజులు.. చిత్రాల్లో ఘంటసాల, ఏఎం రాజా, సౌందర్రాజన్, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్ రాజేశ్వరరావు, జిక్కి, ఏపీ కోమల, వైదేహి, రాజేశ్వరి లాంటి వారితో కలిసి పాడారు. ‘సంఘం చెక్కిన శిల్పాలు’ చిత్రంలో.. ‘పోయిరావమ్మ అత్తవారింటికి అపరంజిబొమ్మ బాలసరస్వతి పాడిన ఆఖరి పాట.
రేడియోలో పాటలు
1944లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో, 1948లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం కూడా ఆమె లలిత సంగీత కార్యక్రమంతోనే ప్రారంభమయ్యాయి. ప్రసిద్ధ సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వర రావుతో కలిసి 1940- మధ్యకాలంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, ఆరుద్ర, ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావులు రచించిన ఎన్నో గేయాలు రేడియోలో పాడారు. అప్పట్లో ఈవిడ ‘రాధామాధవం’ సీడీ పెద్ద హిట్.
19 ఏళ్లు పెద్దవాడైన రాజావారితో పెళ్లి!
1944 నాటికి బాలసరస్వతి కుటుంబం తిరిగి మద్రాసు చేరుకుంది. ఒకసారి వీరి అత్తయ్య, మావయ్యలతో మద్రాసు గిండిలో గుర్రపు రేసులు చూడ్డానికి ఆమె వెళ్ళారు. అప్పటికి బాలసరస్వతి వయసు 15 సంవత్సరాలు. కోలంక రాజా కూడా అక్కడికి వచ్చారు. వారి గుర్రాలు కూడా ఈ రేసుల్లో ఉండేవి. అక్కడ ఆమెను చూసి, పాటలు బాగా పాడుతుందనీ, సినిమాల్లో నటిస్తుందని తెలుసు కున్నారు.
కొన్నాళ్లకు వాళ్లందరూ మద్రాసు వచ్చారు. ‘మీ పాటలు వినాలని వచ్చాం, వినిపిస్తారా?’ అన్నారు. వాళ్లు వచ్చింది పెళ్లి చూపులకే అని బాలసరస్వతి నాన్నగారికి అర్థమైంది. మీ అమ్మాయి నచ్చింది, చేసుకుంటాం అన్నారు. నాన్నగారు ఆమెనే అడగమన్నారు. రాజావారు అడిగినపుడు కాదనలేకపోయింది. ఆయనకు, ఆమెకు దాదాపు 19 సంవత్సరాలు తేడా! కానీ ఆ రోజుల్లో అలాంటివి పట్టించుకునేవారు కాదు. అలా 1944లో కోలంక రాజా వారితో బాలసరస్వతి వివాహం జరిగింది.
‘నా జీవితం ఓ అసంపూర్ణ కీర్తన. పాడుతూ పాడుతూ మధ్యలోనే ఆగిపోయిన గ్రామఫోన్ రికార్డు. మరో జన్మంటూ ఉంటే గాయనిగానే పుడతాను. ఈసారి మాత్రం పెళ్లి, పాట.. ఈ రెండింటిలో ఏది కావాలని అడిగితే పాటే కావాలంటాను. పాటతోనే నా జీవితమంటాను’ రావు బాలసరస్వతి
(గతంలో ఒక ఇంటర్వ్యూలో)
తెలుగు సినిమా పాటలు కొన్ని.
భాషా ఎల్లలు లేని గాన కోకిక బాలసరస్వతి. ఆమె పాటలె న్నో తెలుగు లోగిళ్లను రంజింపజేశాయి. వాటిలో కొన్ని చూస్తే.. అందం చూడవయా ఆనందించవయా, ఇంత తెలిసి యుండి ఈ గుణమేలరా పంతమా మువ్వగోపాలా నా స్వామీ (దేవదాసు ), సుమ కోమల కనునేల కల కాదనుమా బాల, కావ్యపానము చేసి కైపెక్కినానే (ఇల్లాలు), తిన్నె మీది చిన్నోడా, చేస్తాను పెళ్లికొడుకును (భాగ్యలక్ష్మి),
ఏలుకోవయ్యా ఓబులేశా మమ్మేలుకోవయ్యా (చెంచులక్ష్మి ), గోపాల కృష్ణుడు నల్లన (రాధిక ), ఎలా పగాయే (లైలామజ్ను), ఈ సీమ వెలసిన, కాదోయి వగకాడ కాదోయి, ఓ స్వప్నసుందరి కానగనైతినిగా, ఓ పరదేశి నిన్నే వలచే కోనరా (స్వప్న సుందరి), తెలుపవేలనే చిలుకా పలుకవేలనే బదులు పలుకవేలనే, దీపావళి దీపావళి ఇంటింట ఆనంద దీపావళి మాయింట- (షావుకారు), బ్రతుకే నిరాశ, రాజా ఓ రాజ ఆలకింపకోయి (వాలి సుగ్రీవ),
కూయని కూసే కోయిలయైనా ఝుమ్మని, రాజు వెడలి వచ్చె సభకు రవి, హా విధి ఇది ఏమి ఘోరము ఏవిధమ్మున నమ్మగలనో, జనని జనని ఓ కళ్యాణి మంగళదాయిని మహేశురాణి (మాయలమారి), రీతియే లేని వ్రాతా నా బ్రతుకు పాపము కాదా (రూపవతి), ఓ మలయ పవనమా నిలు నిలు నిలుమా, తనపంతమే తా విడువడో తననే వలచిన నను తలపడో, ఫలింపవో నా ఆశలు నశింతునొ నిరాశలో,
అందుకొం డందుకొం డిదే అందమౌ పూల చెండిదే (మానవతి), జో జో జో వయ్యారికడ జో జో జో, రారాదో రాచిలుకా చేరరారాదో రా చిలుకా, చిన్నెల వన్నెల చిననాటి మువ్వపు చూపులే, పరువే బరువాయేగా గౌరవమే కరువాయేగా, పిల్లనగ్రోవి పాటకాడ పిలిచినపలికే దాననోయి తలచిన వలచే (చిన్న కోడలు), ఎల్లవేళలందు నీ చక్కని చిరునవ్వులకై (పిచ్చి పుల్లయ్య),
లాలి నను కన్నయ్య లాలి చిన్నయ్య కుదురు (పెద్దరికాలు), నాటిరోజు ఏల రాదు కోరుకోని నా శోభతోను గోముతీరు (రాణి రంగమ్మ), ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా (మంచి మనసుకు మంచి రోజులు), ఆయనే అరుణోదయ వేళ వేదమంత్ర పారాయణ చేసే (గాంధారి గర్వభంగం).
మరెన్నో లలిత గీతాలు..
రావు బాలసరస్వతి లలిత గీతాలు కూడా ఎంతో జనాదరణ పొందాయి. ముసురేసిందంటే, ఆ తోటలో నొకటి, చలిగాలి వీచింది, ఓ మావా ఓ మావా, ఆ తోటలో నొకటి, నల్లనివాడ, చలిగాలి వీచింది.. వంటి పాటలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ఈ పాటలన్నీ ప్రస్తుతం పలు వెబ్‌సైట్లు, యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి.
ప్రముఖ గాయని రావు బాలసరస్వతిదేవి మరణ వార్త తెలుసుకున్న ప్రముఖులు, అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం తెలిపారు. అంత్యక్రియల్లో పలువురు సినీ, సంగీత రంగ ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు.
సినీ రంగానికి తీరని లోటు
తెలుగులో తొలి నేపథ్య గాయనీమణిగా రావు బాల సరస్వతి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. దక్షిణాదిలోనూ తొలి నేపథ్య గాయనిగా ఆమెకు గుర్తింపు ఉంది. తెలుగు సినిమా రంగానికి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన బాలసరస్వతి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని వేడుకుం టున్నా. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.
రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
ఆత్మకు శాంతి చేకూరాలి
తొలి తరం గాయని, నటి రావు బాలసరస్వతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎనిమిది దశాబ్దాల కిందటే తెలుగు, తమిళ చలనచిత్రాల్లో నటించిన బాలసరస్వతి గాయనిగానూ తన గాత్రాన్ని ప్రేక్షకులకు వినిపించారు. లలిత సంగీతంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని, ఆకాశవాణిలో ఎన్నో గీతాలు ఆలపించారు. బాల సరస్వతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం
బాల సరస్వతి మృతి వార్త కలిచివేసింది
బాల సరస్వతి మృతి వార్త కలిచివేసింది. ఆమె తెలుగు, తమిళ చిత్రాల్లో నటిగా, గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.
నందమూరి బాలకృష్ణ, నటుడు
ఆమె నుంచి ఎన్నో నేర్చుకున్నా
ఆమె ప్రేమ, వాత్సల్యం ఎన్నటికీ మర్చిపోలేనిది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే స్వభావం ఆమెది. చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రేమించేవారు. నేను ఆమె నుంచి చాలా నేర్చుకున్నాను. సంగీతం గురించి మాత్రమే కాదు, వినయం, దయ గురించి కూడా! మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాం అమ్మా.. సద్గతి ప్రాప్తిరస్తు.
కౌసల్య, గాయని