నడిరోడ్డ్డుపై రైతు మార్కెట్
49.26 ఎకరాల మార్కెట్ యార్డు ఉన్నా 4 ఎకరాల్లోనే రైతు మార్కెట్
రోడ్డుపైనే కొనుగోళ్లు, అమ్మకాలు.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
పోలీసులు నియంత్రిస్తున్నా మారని పరిస్థితి
రూ.1.80 కోట్ల బిల్లులు పెండింగ్‌తో నిర్వహణ భారం
గజ్వేల్, జూలై 2: గజ్వేల్ సమీపంలోని వంటిమామిడి వ్యవసాయ మార్కెట్కు అనుసంధానంగా నిర్వహిస్తున్న రైతు మార్కెట్ కు వచ్చే రైతులు, వ్యాపారులు రోడ్డుపైనే అమ్మకాలు కొనుగోలు నిర్వహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మార్కెట్ యార్డులో తగినంత భూమి ఉన్నప్పటికీ ప్రస్తుతం కొంత భాగంలోనే రైతు మార్కెట్ నిర్వహించడంతో స్థలాభావం ఏర్పడి, రైతులు రహదారిపైనే పంటలను విక్రయించే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతిరోజు రహదారి సగం వరకు రైతుల వ్యాపారులు బేరసారాలు చేస్తుండడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
వంటిమామిడి మార్కెట్కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రైతులు కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొస్తున్నారు. జిల్లాతో పాటు హైదరాబాద్ జంట నగరాల నుండి వ్యాపారులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో మార్కెట్లో స్థలం సరిపోక రహదారినే విక్రయ కేంద్రంగా మార్చుకుంటున్నారు. ఆటోలు, ఇతర వాహనాలు రోడ్డుపైనే నిలిపివేసి కొనుగోళ్లు జరపడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
ముఖ్యంగా రైతులు, కొనుగోలుదారులు రహదారిపైనే తిరుగుతూ వ్యాపారం నిర్వహిస్తుండడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. వేగంగా వచ్చే వాహనాల మధ్య రైతులు, మహిళలు, వృద్ధులు, కూలీలు సంచరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ట్రాఫిక్ సమస్యలు తలెత్తగా, పోలీసులు రంగంలోకి దిగి రహదారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేసినా శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. మార్కెట్ వద్ద పోలీసులు ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తూ రైతులు, వ్యాపారులను మార్కెట్ లోపలికి వెళ్లాలని సూచిస్తున్నప్పటికీ, రోడ్డుపైనే విక్రయాలు చేయడం అలవాటుగా మారడంతో పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు.
స్థలాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి రైతు మార్కెట్ను పూర్తిగా యార్డు లోపలికి తరలిస్తేనే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు, రైతులు, వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేసి, అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
అటవీ శాఖ అనుమతులు పూర్తయితే మార్కెట్‌ను విస్తరిస్తాం
మార్కెట్కు మొత్తం 49.26 ఎకరాల భూమి కేటాయించగా ప్రస్తుతం కేవలం నాలుగు ఎకరాల్లోనే రైతు మార్కెట్ నిర్వహిస్తున్నాం. మిగిలిన భూమిలో మామిడి తోటలు ఉండటంతో వాటిని తొలగించేందుకు అటవీ శాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. అనుమతులు వచ్చిన వెంటనే మిగిలిన భూమిని చదును చేసి రైతు మార్కెట్ నిర్వహణకు అనువుగా చేస్తాం. రైతులు, వ్యాపారులు రహదారిపైకి వచ్చి విక్రయాలు చేస్తున్నప్పుడల్లా పోలీసుల సహకారంతో వారిని మార్కెట్ యార్డు లోపలికి వెళ్లేలా ఎప్పటికప్పుడు సూచిస్తున్నాం.
మార్కెట్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని, ఇప్పటికే మార్కెట్ నిర్వహణకు సంబంధించిన రూ.1.80 కోట్ల బిల్లులు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, ఆ నిధులు విడుదల కాకపోవడంతో అదనపు సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టలేకపోతున్నామని వివరించారు.
రేవంత్, వంటిమామిడి మార్కెట్ కమిటీ కార్యదర్శి






