13-12-2024 02:50:21 AM
హైదరాబాద్. డిసెంబర్ 12 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీసు స్టేషన్ పరిధిలో అయిదేళ్ల బాలికపై లైంగికదాడి, హత్య కేసులో 62 ఏళ్ల గఫార్ అలీకి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. అయితే, క్షమాభిక్ష, రెమిషన్ తదితరాల పేరుతో 30 ఏళ్లు గఫార్‌ను జైలు నుంచి విడుదల చేయరాదని ఆదేశించింది. అంతేగాకుండా 15 ఏళ్లపాటు ఎలాంటి పెరోల్‌పై విడుదల చేయరాదని ఆదేశించింది.
2023 అక్టోబరు 16న వెలిమలలో జరిగిన ఈ కేసులో గఫార్ అలీకి సంగారెడ్డి పోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ ఈ ఏడాది సెప్టెంబరులో తీర్పు వెలువరించింది. మరణ శిక్ష ధ్రువీకరణ నిమిత్తం సంగారెడ్డి కోర్టు రికార్డులను హైకోర్టుకు పంపగా, దోషి గఫార్ అలీ అప్పీలు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే సురేందర్, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం గఫార్ నేరం చేసినట్టు రుజువు అవుతోందని పేర్కొంది.
అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష విధించవచ్చని సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో నిర్వచించిందని, ఇది కేసులోని అంశాల ఆధారంగా ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత కేసులో దోషి అయిన గఫార్ 62 ఏళ్ల వృద్ధుడని, గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోవడం, ఉద్దేశపూర్వకంగా చంపాలని పథకం లేకపోవడం, అత్యాచారం తరువాత హింస ద్వారా బాలిక మృతి చెందిందని డాక్టరు ధ్రువీకరించకపోవడం తదితరాలన్నింటీని పరిగణలోకి తీసుకుంటున్నామని వెల్లడించింది.
వీటన్నింటి నేపథ్యంలో కింది కోర్టు విధించిన శిక్షను పాక్షికంగా అనుమతిస్తామని, ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పు వెలువరించింది. 30 ఏళ్ల వరకు ఎలాంటి మినహాయింపులతో విడుదల చేయరాదని, 15 ఏళ్ల వరకు పెరోల్ కూడా మంజూరు చేయరాదంటూ షరతులు విధిస్తూ తీర్పులో స్పష్టంచేసింది.