24-10-2025 06:14:43 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోగల పాత బజార్ లోని శివాలయంలో కార్తీక మాసమును పురస్కరించుకొని కార్తీకమాస విశిష్టత సప్తహ ప్రవచనం, పౌర్ణమి రోజు దీపోత్సవ కార్యక్రమం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార పరిషత్ పెద్దపల్లి జిల్లా ధర్నాచార్యులు మెంగని చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజల్లోపల భక్తి భావం పెంపొందించుటకై తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ను ఏర్పాటు చేసి ధర్మ ప్రచార పరిషత్ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు మన పెద్దపల్లి జిల్లా నుండి సుల్తానాబాద్ శివాలయం ఎంచుకోవడం జరిగిందన్నారు. శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణకు ఈ విషయం తెలపగా ఇది మా మహాభాగ్యంగా భావిస్తున్నామని, శ్రీనివాసుని కృపాకటాక్షాలు మాపై ఉన్నాయని మా శివాలయ భక్తులపై కూడా ఉందని అందుకే ఈ కార్యక్రమం మా వరకు వచ్చిందని సంతోషపడ్డారు. ఈ కార్యక్రమాన్ని మనకు అందించిన తిరుమల తిరుపతి దేవస్థాన ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లాల కార్యనిర్వాహన అధికారి రామిరెడ్డి కృష్ణమూర్తికి సుల్తానాబాద్ ప్రజల తరఫున చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు ఈనెల 30 నుండి నవంబర్ 5 తారీకు పౌర్ణమి వరకు కొనసాగుతుందని ప్రతిరోజు రామ్మోహన్ రావు వారిచే ప్రవచన కార్యక్రమం కొనసాగుతుందని అలాగే పౌర్ణమి రోజు దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షములు, సుల్తానాబాద్ శివుడి కృపాకటాక్షములు పొందాలని చంద్రశేఖర్ కోరారు.